వలి యతిలోక సుందరులు వారల మధ్య నయోనిజాత యు
జ్జ్వలతప ఊర్జితచ్ఛవి దృశావివృతత్వము లేనివేళ నే
వలనునఁ జూడగాఁదగును వల్లభమౌ నతిలోకతేజమున్.
అని తలపోసి పుష్పకమునం దొకచోటను నిల్చియుండి యి
ట్లని మంది నెంచె భూమిసుత యాకృతి యంజనసూనుఁ డామె
పచ్చని పసినిమ్మపండు మెయిచాయగ నుండును బొట్టికాదు కా
దని పొడుగైనగా దుచితమైన ప్రమాణము బొమ్మ యుండెడిన్.
ఆమె పదంబులం గనినయంతన పాదములందు వ్రాల్తలం
పామెయి గల్గునం చెడద నంకురితం బయి నిద్రపోవు కాం
తామణిలోక మంజుల పదంబులు చూచుచు బోవ నెంచి యా
ధీ, మహనీయులై చను పతివ్రతలన్ సమమంచు మానుచున్.
హనుమంతుడు పుష్పకవిమానంలో నిద్రిస్తున్న స్త్రీలలో సీతాదేవి ఉండవచ్చునేమో అనే ఆలోచనతో, ఆ ప్రదేశమంతా నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఆయన ఈ విధంగా అనుకొంటున్నాడు.
" ఇంతకుముందు రావణుడు దొOగతనంగా ఎత్తుకువచ్చిన మానవస్త్రీలు అతిలోక సౌందర్యవతులు. వారందరి మధ్యలో నున్నటువంటి భూసుత సీతను గుర్తుపట్టాలంటే గొప్ప తపస్సు చేత పొందినటువటి అంతర్దృష్టి కాంతిప్రసారం లేకపోతే, చాలా గొప్పదైనటువంటి ఆమె అతిలోకతేజాన్ని చూడటం ఏ విధంగా సాధ్యపడుతుంది?
ఈ విధంగా ఆలోచించిన హనుమ పుష్పకవిమానంలో ఒకచోట నిల్చొని, భూమిసుత ఆకారము, పచ్చని బంగారం రంగు నిమ్మపండు వంటి దేహచ్ఛాయతోను, పొట్టి, అలాగని పొడుగు కానటువంటి ఉచితమైనటువంటి దేహప్రమాణంతోను ఉండవచ్చని తలపోశాడు.
సీతాదేవి పాదాలను చూడగానే, ఆమె పాదాల మీద వ్రాలాలనే కోరిక హృదయంలో మొలకెత్తుతుందని అనుకొన్నాడు. అందుచేత, నిద్రపోతున్న ఆ స్త్రీల కోమలమైన పాదాలను పరీక్షగా చూస్తూ వెళ్ళాలనుకొన్నాడు. కానీ, పతివ్రతలైన అందరు స్త్రీల యొక్క పాదాలు ఆ విధంగా మంజులంగా, మనోజ్ఞంగానే ఉంటాయనే భావనతో ఆ ఆలోచనను మానుకొన్నాడు. "
సీతాదేవి, శ్రీమహాలక్ష్మి యొక్క అవతారం. ఋగ్వేదాంతర్గతమైన శ్రీసూక్తంలో అమ్మవారు " హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం | చంద్రాం హిరణ్మయీo లక్ష్మీం | " అని వర్ణించబడ్డది. వేదవేదాంగాలను, గురూత్తముడైన, వెల్గులనిధియైన, జగదక్షియైన, సూర్యభగవానుని దగ్గర అభ్యసించిన హనుమకు అమ్మవారి యొక్క స్వరూపం అవగతమే.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోని పై పద్యాలలో ఆంజనేయుని నిశిత పరిశీలనాశక్తి, విషయ పరిజ్ఞానము, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
No comments:
Post a Comment