జనిత జ్యోత్స్నయుగా శశాంక వదనచ్ఛాయాసనాథంబుగా
ననియెన్ నమ్మకమన్న యట్టి దినుసాహా ! స్వచ్ఛమై కూడ నే
చిన వక్రంబగు సన్నివేశమున వంచింపంబడున్ స్వచ్ఛతన్.
సుగ్రీవుడిని సులువుగా గుర్తుపట్టేటందుకు వీలుగా, శ్రీరాముడు లక్ష్మణుడి చేత అడవిలో పూచిన గజపుష్పముల మాల కట్టించి, అతడి మెడలో వేయించాడు. సుగ్రీవుడు, కిష్కింధా నగర ద్వారం వద్దకు వచ్చాడు. వాలి బలపరాక్రమాలను గురించి మరొక్కసారి చెప్పి, ఎవరైనా తాము నేర్చిన కళలను నమ్ముకోకుండా, ఇతరుల కళలను నమ్ముకొని, కయ్యానికి కాలు దువ్వితే, అది మూర్ఖత్వమౌతుందని, అటువంటి మూర్ఖశిరోమణినైన తనను వాలి నుండి రక్షించమని వేడుకొన్నాడు. ఈ సారి కూడా సుగ్రీవుణ్ణి గుర్తుపట్టకుండా ఉంటే, చేజేతులా సుగ్రీవుడికి నీళ్ళు వదులుకొనమని చెప్పాడు. వాలి బలవంతంగా తన మెడలోని పుష్పమాలను త్రెంచివేసినా త్రెంచివేస్తాడని, అందుచేత, శీఘ్రంగా పనిని ముగించమని రాముడికి చెప్పాడు. అంతేకాదు, తనకు చేతిలో చేయి వేసి చెప్పమన్నాడు. సుగ్రీవుని భయాందోళనలకు శ్రీరాముని సమాధానమే యీ పద్యం.
" సుగ్రీవుడు ఈ విధంగా అనగానే, రఘురామమూర్తి, చిరునవ్వు మొలకలు ముఖమంతా వెన్నెలలాగా అలుముకొనగా, చంద్రబిబం వంటి ముఖారవిందంతో, ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు.
ఆహా ! నమ్మకమన్న దినుసు ఎంతో నిర్మలమై ఉండి కూడా, బాధల వలన, అసలు విషయంలో వక్రీకరింపబడి నిర్మలత్వం అనే దాని నుండి వంచింపబడుతున్నది కదా ! "
సుగ్రీవుడు వాలి చేతిలో పలుమార్లు దెబ్బలు తిని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఋష్యమూక పర్వత ప్రాంతంలో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. శ్రీరాముని వంటి మహాధానుష్కుని, ధర్మాత్ముని అండతో, ఒకసారి వాలితో తలపడి, వాలిసుగ్రీవుల పోలికలు ఒక్కటిగా ఉండటం వల్ల, భంగపడ్డాడు. గుర్తుపట్టడానికు వీలుగా గజపుష్పమాలాంకృతుని చేసినా కూడా, వాలిబలపరాక్రమాలను తలచుకొని, సుగ్రీవునికి బెదురుపాటు వచ్చి, నమ్మకం సడలింది. జీవితంలో కష్టాలు పడినవానికి, నమ్మకం అంత తొందరగా కుదరదు. నమ్మకం అన్నది స్వచ్ఛమైనదైనా కూడా, సన్నివేశాన్ని బట్టి, దానిని చూసేవాడి దృష్టి మారుతుంది. అదే రాముడు చెప్పింది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.
No comments:
Post a Comment