వనథుల్ నాల్గిట నంపనిప్పు లురలింపన్ జూచుటే ధర్మమా?
తన శక్తిన్ గుదియించి ధర్మకలనాతాత్పర్య మార్గంబునం
దుననే పోవుట దేవతాపథము, వేర్త్రోవల్ సురారాతికౌ.
తనకుం జియ్యయుఁ బట్టి క్రూరమృగయూధం బమ్మ నాన్నంచు, నే
రని, దీ మానవలోక మా పగిదివారా? ధర్మ మన్నట్టి చి
క్కని యా చక్కని వస్తు వెచ్చటనొ స్వర్గం బందునా కల్గు? నీ
కును నాకున్ మది సాధువైన యెడలన్ గూలంకషం బిచ్చటన్.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
రాముడి వనవాస వార్త విన్న లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. తనకు అన్న రాముడే దైవం, తల్లీ,తండ్రీ, అన్నీ అన్నాడు. రాముడిని పట్టాభిషిక్తుడిని చేయటం కోసం ఎవరినైనా ఎదిరిస్తానన్నాడు. దానికి సమాధానoగా రాముడు:
" ఎవడైన ఒకడు మహాబాహుబలపరాక్రముడైనంత మాత్రాన, తన శస్త్రాలతో నాలుగు సముద్రాలలో నిప్పులు కురిపించాలని చూడటం ధర్మమా? తన శక్తిని తగ్గించుకొని, ధర్మ మేర్పరిచిన మార్గంలో పోవటమే దేవతలకు ప్రీతికరమైన మార్గం. తక్కిన దారులన్నీ రాక్షసులు వెళ్ళేవి.
దైవం క్రూరమృగాలకు అమ్మ, నాన్న అంటూ తెలియకుండా చేసింది. మానవలోకం లోని వారు ఆ కోవకు చెందినవారా? ధర్మ మనే అతి చిక్కని, చక్కని వస్తువు స్వర్గంలో నైనా నీకు లభిస్తుందా? మనస్సు కనుక శుద్ధంగా, సాత్వికంగా ఉంటే, ధర్మాచరణ మనేది నీకు, నాకు, ఒక్క మానవలోకం లోనే సంపూర్ణంగా సిద్ధిస్తుంది. "
తల్లి, తండ్రి, బంధువులు అనే సంబంధాలు చాలా చిక్కనివి, చక్కనైనవి. గోవుల వంటి సాధుజంతువులలో వాత్సల్యం కనపడుతుంది. కానీ, క్రూరమృగాల్లో ఇది లేదు. అమ్మ, నాన్నలు మానవులకు దైవం ప్రసాదించిన వరం. ఆ సంబంధాలను సువ్యవస్థితంగా ఉంచుకోవటానికి ధర్మాన్ని పాటించటం తప్పని సరి. ఇంత మంచి అవకాశం స్వర్గంలో కూడా లేదు.
" రామో విగ్రహవాన్ ధర్మః " అని రామాయణంలో మారీచుని నోటనే పలికిస్తాడు మహర్షి వాల్మీకి. దైత్యుడైన మారీచుడే ధర్మం యొక్క విశిష్టతను చూడగల్గినపుడు, ఇక ధర్మాచరణ మీద నిర్మింపబడవలసిన మానవ సమాజం, దానిని తప్పి పెర త్రోవల పోతే, ఆ మనుగడకు అర్థ మేమున్నదని రాముని భావన.
No comments:
Post a Comment