నీ యటవుల్ చరించెడుఁ బితృప్రియ కార్యచణుండు, వింజపున్
మాయుక సింహమైన మునిమండను, పాదనమస్క్రియా సప
ర్యాయుతమైన యూహ పెనుపై చనుదెంచెను బ్రాహ్మణోత్తమా !
అవసరంబైన దర్శన మాచరింతు
మనిన వృద్ధుండు తలయెత్తి హస్తమడ్డ
మిడి సితాంభోద విద్యుత్ప్రమీల దృష్టి
పఱపి రఘుమూర్తిపై లోనికరిగి లేచి.
ఆకాశమున నుండి యవతరించిన నవాషాఢ నీలాంభోద సదృశమూర్తి
దశరథరాజు పుత్రకుడట, సంజకెంజాయ క్రమ్మిన సితజలదమూర్తి
యొక్కడు, నిలుచున్న ఉర్విలో నుండి బంగరుబొమ్మ లేచిన కరణి నొప్పు
నొక పసిచాన, మదుజ్జ్వలభ్రూదీప్తి వీచి అవసరంబు వేచియుండి
రనినఁ గుంబోద్భవుండు పేర్కొనరయేమి
యాత్మనామంబు లనిన వృద్ధావనిసురుఁ
డిపుడు వారి నామంబుల నేను చెప్పి
తిని గదా యన నవ్వి రమ్మనియె మౌని.
సీతారామలక్ష్మణులు అగస్త్యుని సోదరుని దగ్గర శలవు తీసుకొని, అగస్త్య మహర్షి దర్శనం కోసం బయలుదేరారు. ఆశ్రమ పరిసరాల్లో అగ్నిగృహానికి దగ్గరగా ఉన్న ఒక బావి వద్ద, ముఖం, కాళ్ళు చేతులు కడుక్కొన్నారు. అక్కడ, కనుబొమలు బాగా తెల్లబడ్డటువంటి, యజ్ఞోపవీతములు ధరించినటువంటి ఒక తొంభయ్యేళ్ళ వృద్ధుడిని సమీపించి, అతడిని లక్ష్మణుడు ఇలా అడిగాడు.
" బ్రాహ్మణోత్తమా ! ఈయన సూర్యవంశంలో మణిపూస వంటివాడు, దశరథ మహారాజు కుమారుడు. పితృవాక్య పరిపాలన చేస్తూ, వనవాసం చేస్తున్నాడు. వింధ్యపర్వతమనే మదగజం పాలిట సింహమైనటువంటి అగస్త్య మహర్షి పాదాలకు నమస్కరిoచాలనే కోరిక మిక్కుటమై ఇక్కడకు వచ్చాడు. అనుమతిస్తే, వారి దర్శనం చేసుకొంటాము.
ఈ మాటలు వినగానే వృద్ధుడు తల ఎత్తి, చేతిని అడ్డం పెట్టుకొని, తెల్లని మేఘం వెనుక నున్నట్టి మెఱుపు వంటి చూపుతో, రాముడిని చూసి, లోపలికి వెళ్ళాడు.
లోపలికి వెళ్ళిన ఆ వృద్ధుడు ఇలా చెప్పసాగాడు.
" దశరథ మహారాజు కొడుకట. ఆకాశం నుండి దిగివచ్చిన ఆషాఢ మాసంలోని నీలమేఘం లాగా ఉన్నాడు. ఇంకొకాయనేమో, సంధ్యారుణ కాంతులు పులుముకొన్న తెల్లని మేఘంలాగా ఉన్నాడు. భూమిలో నుండి నిట్టనిలువుగా లేచివచ్చిన బంగారుబొమ్మ వంటి ఒక పసిపిల్ల నిల్చొని ఉంది. నా దగ్గర నుండి సమాధానం వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ మాటను వినగానే, అగస్త్య మహర్షి, వారేమన్న వారి పేర్లు చెప్పారా అని అడిగాడు. దానికి, వృద్ధబ్రాహ్మణుడు, ఇందాక చెప్పింది అదే కదా అని అన్నాడు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, సరే రమ్మనమని అన్నాడు.
సంభాషణాపూర్వకమైన ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment