బెట్టి యేమి ఫలము పిట్టతిండ్లు
ఘటశరీరు నిన్ను జటిధూర్జటీ ! కొంచు
బోనువలయుఁ దృప్తి పొందవలయు.
భక్షిత సర్వమైన తరువాతను మాంసరూపమై
కుక్షిగతంబు కొమ్ములను గ్రుమ్మునొ నాజను గొఱ్ఱెపోతు మీ
భక్షణమౌత యేమి వ్రతపారణ చేసెదు మౌనిరాజ ! నా
యక్షియుగంబు తృప్తి గను నద్దిర ! నీవయి యారగించుచో.
పేరిమిఁ బిల్చి భోజనము పెట్టెద నన్నను బాఱిపోదు రే
లో ! రుచి లేని బక్కద్విజు లూరక యీకడ చన్ననాళ్ళ భీ
శూరుల భోజనప్రియులఁ జూచినఁ ద్వాదృశులం బ్రియంబు నా
కా రమణీయగేహ మది యద్దియె మా గృహమో వ్రతీశ్వరా !
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
బ్రహ్మదేవుని యొక్క అభ్యర్థన మేరకు అగస్త్యుడు అరణ్య మార్గంలో, వాతాపి ఇల్వలుల కోసం వెళ్ళాడు. పొట్టిగా, బొద్దుగా ఉన్న అగస్త్యుడిని ఇల్వలుడు చూసి, అతడితో ఈ విధంగా అన్నాడు.
" ఏ మునులను చూసినా, ఈనె కఱ్ఱపుల్ల ల్లాగా సన్నగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళను అతిథులుగా ఇంటికి పిలిచి భోజనం పెడితే వ్రతఫలం ఏం దక్కుతుంది? వాళ్ళూ వాళ్ళ పిట్ట తిండ్లూను ! బొద్దుగా, కుండలాగా ఉన్న నిన్ను తీసుకుపోవాలి, మేము తృప్తి పొందాలి గానీ !
తిన్న తరువాత కూడా మాoసం రూపంలో పొట్టలో ఉండి, కొమ్ములతో కుమ్ముతుందా అన్నట్లుగా ఉన్న యీ గొఱ్ఱెపోతు మీకు వ్రతపారాయణ కోసం ఆహారం అవబోతున్నది. మునీశ్వరా ! మీరు తృప్తిగా భోజనం చేస్తుంటే, నిజంగా ఇది మాకు నేత్రానందం కలిగిస్తుంది.
అరరే ! ప్రేమతో పిలిచి భోజనం పెడతామంటే పారిపోతా రేమిటి? ఈ రుచి తెలియని బక్క బ్రాహ్మణులని చూసిన చాలా రోజుల తరువాత, మీ లాంటి భయం లేని, భోజనప్రియులను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగో అందంగా కనపడుతున్నదే, అదే మా ఇల్లు. "
ఇల్వలుడు మాట్లాడిన మాటలలో, బొద్దుగా, బలంగా, కుండలాగా ఉన్న అగస్త్యుడిని చంపి, ఎప్పుడెప్పుడు తినాలా అన్న ఉత్సుకత ద్యోతకమౌతున్నది. " భక్షిత సర్వమైన తరువాతను మాంసరూపమై కుక్షిగతంబు కొమ్ములను గ్రుమ్మునొ నాజను గొఱ్ఱెపోతు " అనటంలో, " నువ్వు తిన్న తరువాత కూడా, కొమ్ములతో పొట్ట చీల్చుకొని వచ్చేటట్లున్న గొఱ్ఱెపోతు " అనే అర్థం, " రుచి లేని బక్క ద్విజు " లనటంలో " రుచీ పచీ లేని " అన్న అర్థం స్ఫురిస్తున్నాయి.
అయితే, " జటి ధూర్జటీ " అన్న సంబోధనలో, ఇల్వలుడు తెలియకుండానే పరమమాహేశ్వరుడైన అగస్త్యుడితో ఆటలాడుతున్నాడని ధ్వనిస్తున్నది.
పదాల్లో తెలుగుదనం ఉట్టిపడేటట్లు, సంభాషణాపూర్వకమైన కథాకథనం చేయటంలో విశ్వనాథ అందె వేసిన చేయి అనేది యీ పద్యాలు నిరూపిస్తున్నాయి.
No comments:
Post a Comment