మన్నం బావనియు నిట్టులనియెన్ నేనే
మన్నానని కూర్చ్చుంటిని
మిన్నక యిటఁ దిరిగి తిరిగి మే నలయుటచే.
మేము శాఖామృగంబుల మేమి మాకు
నిద్ది యూరని యుండునా యిది గృహ మ
టంచు నుండునా ! యెచటఁ గాయయును గసురు
దొరకు నచ్చోటఁ దిరుగుచుందుము బుభుక్ష.
ఇంతటి రాజధాని మఱి యెవ్వరు చూడకయున్న గొప్ప యే
మంతగఁ గట్టుకో ననిన నాసుర హాస వికారరావయై
యెంతటికోఁతి వంచుఁ బడగెత్తిన కాటుగ మోము వచ్చి కా
ప్పంతయుఁ గన్పడన్ యమునివాఁకిలి తీసినయట్లు వచ్చినన్.
ఆఁగు మటంచు నేటి కది యంతటి ధూర్తత నేను వట్టి యూ
రేగెదఁ జూచివత్తు నిట నెవ్వరి నేమియుఁ జేయనం చనన్
వే గురువెట్టి దానవియు బిట్టుగఁ దా నరచేతవ్రేసెఁ దీ
వ్రాగసురాలు దాని కతఁడై యణఁగారునటంచు నెంచుచున్.
క్షితితలంబున నుండి లేచిన మహాశ
ని ప్రరోహంబుగాఁ బావనియును లేచి
యసురిమొగమున నఱచేత నప్పళించె
నసురి మొగమున నిరుచేత నదుముకొనియె.
లంకిణి హనుమల మధ్య సంభాషణలతో కూడిన ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
విశ్వనాథ కవితా వైదుష్య మేమంటే, అవి గీతపద్యాలైనా, వృత్తాలైనా, కందాలైనా, ఇతరులకు అంత తొందరగా కొరుకుడుపడని మధ్యాక్కరలైనా, అలవికాని ఛందోవృత్తులైనా, వారి చేతిలో అందంగా ఒదిగిపోతాయి.
లంకా పట్టణంలో ప్రథమ ప్రవేశద్వారం దగ్గర కాపలా కాస్తున్న లంకిణి హనుమను చూసి హుంకరించింది. లంకిణి గద్దింపు మాటలు వినపడగానే దేహాన్ని పెంచిన హనుమను " టక్కరికోతి " వని నిందించింది. వారిద్దరి మధ్య రమ్యంగా సాగిన సంభాషణే ఈ పద్యాల లోని భావం.
" ' నిన్నేం చేస్తానో చూడు ! ' అని లంకిణి అనగానే, వాయునందనుడు, ' నిన్నేమన్నానని. అటూ ఇటూ తిరిగి వచ్చి, అలసిపోయి, చప్పుడు చేయకుండా కూర్చున్నాను.
మేము చెట్లకొమ్మల మీద గెంతుతూ తిరిగే వాళ్ళం. మా కేమన్నా ఒక్క ఊరని గానీ ఒక్క ఇల్లని గానీ ఉంటుందా? ఎక్కడ కాయ కసరు దొరుకుతాయో, ఆకలిని తీర్చుకోవటానికి అక్కడల్లా తిరుగుతుంటాము.
ఇంత పెద్ద రాజధానిని, పెద్ద నగరాన్ని కట్టుకొని, మరి ఎవరూ చూడకూడదనుకుంటే, అది ఏమంత గొప్పతనం? " ఈ మాటలు వినగానే రక్కసి వికృతంగా నవ్వి, " అరే ! ఎంతటి కోతివి? ' అంటూ, పడగను పైకెత్తి కోరలు చాచిన మహాసర్పం లాగా, యమపురి ముఖద్వారం తెరిచినట్లుగా, తన పెద్ద నోటిని తెరిచింది.
ఇదంతా విన్న హనుమ, ' ఆగమంటూ ఎందుకంత దురుసుతనం చూపిస్తావు? నేను ఊరకే ఊళ్ళో తిరిగివస్తా. ఎవ్వరినీ నేను ఏమీ చెయ్యను. " అన్నాడు. ఈ మాటలు వినగానే, ఆ రాక్షసి గద్దించి, అణగిపోయేటట్లుగా, హనుమను అరచేతితో గట్టిగా చరిచింది. పవమానసుతుడు కూడా, నేలపై నుండి ఒక్కసారిగా లేచి, పిడుగు పడవేసినట్లుగా అరచేతితో లంకిణి ముఖం మీద మొత్తాడు. దానితో ఆ రక్కసి రెండు చేతులతో ముఖాన్ని అదుముకొంది. "
విశ్వనాథ ఈ సన్నివేశాన్ని సంభాషణాపూర్వకంగా వర్ణించిన తీరు పాఠకుని మనస్సును హత్తుకొంటుంది.
No comments:
Post a Comment