భాసించుం బయి కంతె, నిక్కువముగా భావస్థితం బెల్ల నీ
యాసల్ కోపము లాది భావములు కట్టా! క్షుత్పిపాసల్ ద్వయం
బే సర్వంబగు దైహికంబు, కనుమా ! యీ ధర్మ మే పాటిదో !
ఒక్కఁడు కామినీవశత నొక్కొక దోస, మొకండు రాజ్యపున్
మక్కువ నొక్క కల్మషము, మానవుఁ డొక్కొకఁ డొక్క చెట్టకుం
జిక్కును, ధర్మ మిప్పగిది సేగిఁబడున్ దనయొక్క యిష్టమే
నిక్కమ యన్నవారిబడి నెత్తురు లేఱులు పాఱె ధాత్రిపై.
శ్రీరామచంద్రుడిని వనవాసానికి పంపటం సహించలేని లక్ష్మణుడు కోపవివశుడయ్యాడు. రాముడు అతడిని ఓదార్చి ధర్మసూక్ష్మాలను తెలియజేశాడు.
" లక్ష్మణా ! ఈ సమస్త రాజ్యం, దేసంబంధమైన మనోవికారాల చేత అతిశయిస్తూ పైకి చాలా గొప్పగా కనిపిస్తుంది. అంతే. ఈ ఆశలు, కోపాలు ఇవన్నీ యదార్థంగా భావరూపంలో ఉంటాయి. ఆకలిదప్పులనే యీ రెండే దేహానికి సంబంధించినవి. కాబట్టి, నీవు అమలు జరుపాలనుకొన్న ధర్మం (శిక్ష) ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించు.
ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన దోషానికి పాల్పడుతున్నాడు. ఒకడు కామనికి వశమై దోషాన్ని ఆచరిస్తున్నాడు. ఇంకొకడేమో రాజ్యకాంక్ష అనే మాలిన్యాన్ని పులుముకొంటున్నాడు. ప్రతిమనిషీ ఏదో ఒక కీడు తలపెడుతూనే ఉన్నాడు. ధర్మం ఈ రకంగా ఆపదలో పడుతున్నది. తాము చెప్పిందే యదార్థం, తమ మాటే చెల్లాలన్న వారి వల్ల భూమి మీద రక్తం ఏరులై పారుతున్నది. "
ఇక్కడ రాముడు దేహసంబంధమైన, ఆత్మసంబంధమైన విషయాలను భిన్నంగా చూపించి, రాజ్యమేలటం మొదలైనవి ఏ విధంగా పై పై మెరుగులో చెప్పాడు. అంతేగాక, స్వార్థంతో కూడిన పనులు ఏ విధంగా వినాశకరమైనవో చెప్పాడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment