లేనిచో నేమున్నది? సూర్యుడు ప్రాగ్గిరిశిఖరారోహణము చేసినవెంటనే మన మందఱమును నిద్ర మేల్కొందుము. దైనందినముగా కాలకృత్యములు నిర్వర్తింతుము. స్నానపానాదులు చేయుదుము. భోగములను కూడ ననుభవింతుము. దీనిలోని విశేష మేమున్నది? ఒక కాలువ ప్రవహించుచున్నది. ఈ చంద్రభాగా నదియే కలదు. దీనిని నది యనుట యేమి? దీనిని నది యని పిలిచెడి యాంధ్రుల వివేకమే వివేకము. తుదకు గంగానది యంత యైనను లేదు. కృష్ణయు, గోదావరియును పెద్ద నదు లనవచ్చును. ఈ చంద్రభాగ చిన్నికాలువగా ప్రవహించుచున్నది. ఎచ్చట దిగినను నడుములోతు నీళ్ళుండవు. ఆ ప్రవాహములో నున్న విశేషమేమి? ఏమియును లేదు. నీళ్ళు ప్రవహించుచున్నవి. అంతే విశేషము. కానీ యీ కొండ చివరకు వచ్చినది. అచ్చటినుండి క్రిందబడినది. ఆ పడుటలో నైరావతము యొక్క తొండము ఘూర్ణిల్లినట్లు పడుచున్నది. క్రిందపడి యింత చెఱువు కట్టి యీ లోయనంతయు నింత రమణీయము చేసినది. చిత్ర చిత్రములయిన స్రోతస్సులు ప్రతిశిలామధ్యము నందు ప్రజ్వలింపించినది. దాని చలువ చేత నీ కొండలోయ యంతయు పులకరించినది. ఆ పైన దుబ్బు లేదు. పచ్చిగడ్డి లేదు. నాపఱాళ్ళ మయము. ఈ లోపల దీని నీళ్ళచేత కొండ లోతట్టుల లోని శిలాఖండముల నడుమగల మృత్స్న తడిసి తదంతర్నిహితప్రాణశక్తి చిత్ర చిత్రములయిన యోషధులుగా ప్రాదుర్భావము గాంచినది. జలసిక్త పృధ్వీపదార్థమునందు నే విచిత్రమైన శక్తి కలదో ! యీ రెండు భూతముల సంయోగముచేత నెట్టి ప్రాణము, లోన లోన చిఱుకదలికయై కళకళలై యే యాకారముతో త్రవ్వికొని వెలిని వచ్చునో మనకు తెలియదు.
ఈ నదీజీవితములో నీ జలపాతము, నీ లోయ, యీ విచిత్రౌషధీనికాయసమావర్భావము నిది యొక విచిత్రమైన యనుభూతి. ఈ యనుభూతి యీ నదీమూర్తికి నిత్యముగా భాసించుచున్నది. ఏ తదనుభూతి నిత్యతా పరమ మాహేశ్వరీదేవి, యీ నదీదేవత పరమ యదృష్టవంతురాలు. మానవజీవితమునం దీ సౌందర్యము లేదు. మానవజీవితమునం దొక యనుభూతివిశేషము కలిగినచో తన్నిమేషమేకపరిభుక్తమై తన్నిమేషపరిలుప్తమగును. అందుచేత మానవుడు ఒక మహావిచిత్రానుభూతినొందినపుడు సద్యోమరణము నొందినచో జన్మచారితార్థ్యము నందును.
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ: పురాణవైర గ్రంథమాల:1
No comments:
Post a Comment