తగియె నెక్కెడు గడపయు దిగెడు గడప
మఱియుఁ దగె నేది యర్థించె మహితమూర్తి
యద్ది లభియించ దొక్క గేహాంతరమున.
కపిమహేశ్వరునకు గానంగఁ రాదెంత
వఱకు సీత యంతవరకుఁ గాగ
నంతకంత కాగ శాంతభావంబును
బూనుచుండె హృదయమున నతండు.
ఇది సత్పురుషుల యెడఁదల
కదలిక కార్యఫల మెంతగా దవ్వగునో
అదియంత శాంతులగుదురు
కదలిన కార్యఫలమందు గంధగజేంద్రుల్.
హనుమ లంకాపట్టణంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. ఇంటింటినీ రహస్యంగా గాలిస్తున్నాడు. జుగుప్సాకరమైన దృశ్యాలను చూస్తున్నాడు. అయినా, పరమవైరాగ్యభావన కలవాడు కనుక, మొక్కవోని దీక్షతో తన అన్వేషణను కొనసాగించాడు.
" హనుమ బిచ్చగాడు అనటం ఎంతైనా సరిపోతుంది. ఎందుకంటే, ఆయనది ఎక్కే గడప, దిగే గడప. అంతేగాక, అతడు ఏది కావాలనుకుంటాడో, ఒక్క ఇంట్లోనన్నా అది దొరకటం లేదు.
కపిమహేశ్వరుడికి యెంతగా సీత కనిపించకుండా ఉన్నదో, ఆయన హృదయంలో శాంతభావం అంతగా పెరుగుతున్నది.
ఇది సత్పురుషుల గుండెలో కనపడే కదలిక. కార్యఫలం ఎంత దూరంగా ఉంటుందో, వాళ్ళలో శాంతస్వభావం అంత పెరుగుతుంది. పని కనుక సానుకూల మయ్యేటప్పుడు మాత్రం, వాళ్ళు మదించిన ఏనుగుల్లాగా విజృంభిస్తారు. "
ఆదిభిక్షువైన శివుని అంశతో పుట్టినవాడు హనుమంతుడు అన్నది ఈ సందర్భంలో గమనార్హం.
హనుమ లక్ష్యం సీతాన్వేషణ. ఆ లక్ష్యసాధన కోసం, బిచ్చగాడిలా లంకాపట్టణం లోని ఇంటింటికీ తిరిగాడు. కానీ, తన కేది కావాలో, అది మాత్రం దొరకటం లేదు. బిచ్చగాడు కోరుకొన్నది యెప్పుడూ దొరకదు కదా !
సత్పురుషులకు అసత్పురుషులకు ఉన్న తేడా ఇదే. సత్పురుషులకు కార్యసాధన మీద దృష్టి కాబట్టి, వారిలో సహన మెక్కువగా ఉంటుంది. అదే, అసత్పురుషులకు, కార్యసాధన కంటె, పని పూర్తి చేసి మెప్పు పొందాలన్న తాపత్రయం ఎక్కువ. ఈ కారణం చేత, సత్పురుషులు, పని సానుకూల పడేటంతవరకు పరమ శాంతస్వభావులై ఉంటారు. ఒక్కసారి, పని సానుకూల పడే లక్షణాలు కనిపించగానే, కార్యసాధన కోసం మదపుటేనుగుల్లాగా విజృంభిస్తారు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment