యెవ్వడు నీ యెడందకును నెత్తగు ప్రేమపొలంబొ, వాడు నే
నివ్వసుధాతలంబు వరియింపనటన్నను వేనికోసమై
చివ్వకుఁ జొత్తువోయి రఘుసింహమ ! సింహము వట్టి కోపియా?
అన్యాయ్యంబు క్షమింపు, మెంతయిన ధైర్యంబూనగానే వలెన్
సన్న్యాసం బెద నూనువానికయి యీ సంత్రాస మేలా? శుచా
దైన్యం బందిన తల్లి నేను విడి, యో తమ్ముండ నీవున్ విడన్
శూన్యంబై చనునేని నాదరువు తచ్చోకంబు దుర్దాంతమౌ.
వనవాసానికి వెళ్తున్నాడన్న వార్త విని మనస్తాపానికి గురైన లక్ష్మణునికి కర్తవ్యోపదేశం చేస్తున్నాడు రాముడు.
" లక్ష్మణా ! నువ్వు ఎవరికోసం యీ జగత్తు నంతటినీ భస్మం చేయదలచుకొన్నావో, ఎవడైతే నీ హృదయంలో ఉన్నతమైన ప్రేమస్థానాన్ని పొందాడో, అటువంటి వాడే తనకు రాజ్యపాలన వద్దని విడిచిపెడితే, ఇంకా ఎవరి కోసమని యీ కలహాన్ని పెట్టుకొంటున్నావు? నీవు రఘువంశంలో సిం హం వంటి వాడివి. సిం హానికి ఒక్క కోపమే ప్రధానమా?
ఇది న్యాయంగా లేదు. (ఒకవేళ నీ దృష్టిలోఇది అన్యాయమైనా), క్షమాగుణాన్ని ప్రదర్శించు. అంతేగాక, క్లిష్ట సమయాల్లో యెంతైనా ధైర్యంగా ఉండాలి. అయినా గుండె నిండా వైరాగ్యం నింపుకొన్న నా వంటివాడి కోసం బాధపడటం, భయపడట మెందుకు? దీనావస్థలో ఉన్న తల్లిని నేను విడిచివెళ్తున్న యీ సమయంలో, నువ్వు కూడా విడిచిపెడితే, ఆమెకు ఆదరణ, ఆప్యాయత కరువైపోయి, ఇక ఆ శోకం భరింప శక్యం కాకుండా ఉంటుంది. "
శ్రీరాముడు మనస్సన్న్యాసి. ఆయన ధర్మాన్ని అనుష్ఠించి, లోకానికి మార్గదర్శకత్వం వహించటానికి మానవుడిగా అవతారమెత్తినవాడు. ఈ భావమే రాముని ప్రతి మాటలోను ద్యోతకమౌతుంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment