గోరణమున మంత్రసాని కోసెను బొడ్డున్
నీరజము కాఁడఁ జిదిమిన
నేరిమిని గలుక్కు మనె మనీషన్ విధియున్.
చిటపట సవ్వడి వినఁబడెఁ
గిటకినన్ బట్టమహిషి కిటికిదెసఁ గన్న
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్లు వాన కురిసెడున్.
పట్టమహిషి కౌసల్య, స్వభాను నామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి నాడు పునర్వసు నక్షత్ర శుభలగ్నంలో మగశిశువుని ప్రసవించింది. మంత్రసానులు శిశువుని అటూ ఇటూ కదిలించారు. శిశువు కెవ్వున ఏడ్చాడు.
" తోరము కట్టిన కత్తితో మంత్రసాని శిశువు బొడ్డును కోసింది. అక్కడ సత్యలోకంలో, పద్మాసనంలో కూర్చొన్న బ్రహ్మదేవుడు పద్మం కాడ చిదిమినట్లయి అదిరిపడ్డాడు. "
తోరము అంటే వ్రతసూత్రము. వ్రతాలు చేసేటప్పుడు ముంజేతికి కట్టుకొనేది.
" చిటపట చినుకులు పడుతున్న చప్పుడు వినిపించి కౌసల్య కిటికీ వైపు చూసింది. చిటికలు, గుటికలు, మెటికలుగా, పటపటా చిటచిటా జల్లువాన కురిసింది. "
మొదటి పద్యంలో విశ్వనాథ యొక్క అద్భుతమైన కల్పనా వైదుష్యం కనపడుతుంది. బ్రహ్మ, శ్రీమహావిష్ణువు యొక్క బొడ్డుతామర నుండి పుట్టినవాడు. అందువల్ల, శిశువు బొడ్డు కోయగానే, సత్యలోకం లోని బ్రహ్మ అదిరిపడ్డాడని చమత్కారమైన కల్పన.
రెండవ పద్యంలో శ్రీరామ జననానంతరం కురిసిన వర్షం వర్ణన ఇది. వర్షం కురిసేటప్పుడు టప టపా శబ్దం వస్తుంది. అందువల్ల టకార ప్రాసతో చిటపటలను ధ్వనింపజేశారు విశ్వనాథ. మొదటి పాదం లోని చిటపట, చివరి పాదం దగ్గరకు వచ్చేసరికి పటపట చిటచిటగా మారటం, మొదట చిన్నగా పడిన వానజల్లులు, తరువాత వేగాన్ని పుంజుకోవటాన్ని సూచిస్తున్నది.
శిశువు పుట్టగానే బొడ్డును కోయటం తెలుగువారి సంప్రదాయం. అదే విధంగా, శ్రీరామనవమి నాడు చిరుజల్లులతో తెలుగునేల పులకరించి పోవటం అందరికీ అనుభవంలో ఉన్న విషయం. ఈ రెంటినీ అందమైన కందాలలో నిబంధించి, వాటికి కల్పనలను జోడించి ' అహో ! విశ్వనాథ ' అనిపించారు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనివి.
No comments:
Post a Comment