ఒకనాటి ప్రొద్దున సూర్యోదయమైనది. ఉదయాంభోజాత బంధు మందారకుసుమ సందోహారుణకిరణ సoతానతంతన్యమాన ధారుణీరుహ కిసలయ చ్ఛవిచ్ఛటా పరిదీప్తమైన యా ప్రదేశము నాకబలి మ్రుగ్గులు పెట్టినట్లుండెను. అవియొక వింత వెలుగులు ప్రసాదించినవి. ప్రాతఃకాల సమాయాత మందానిల సుందర తరంగ డోలికాకలిత క్రీడావిలాస పేశలములయిన ప్రాతర్వికసితకుసుమములు శిశువుల వలె సుందర మందహాస ప్రదర్శితపరిమిత దంతకాంతి ప్రరోహమధుర హేలానిదానములుగా కనిపించుచుండెను. సద్యోవికసిత పద్మ్మశేఖరద్వార నిర్వియాసు మధుకర శిరోదర్శనము చేత చూచుకముతోడి ముక్తకంచుకయైన ప్రౌఢయువతి పరమ రమణీయ వక్షోమండలము వలె సరోవరైక దేశములు భాసించుచుండెను. తద్గతోషఃకాల పతిత హిమకణ చారుశేఖరములయిన ఘాసాగ్రము లరుణ సూర్య కిరణ చ్ఛటాసoదీప్తములై శత్రుని పొడిచి, తడిసిన బాకు తుది కల రక్తబిందువుల వలె భాసించుచుండెను. కొన్ని కోడెదూడలు మోరలువంచి తోకనెత్తుకొని నాల్గు కాళ్ళు కలిపి దూకగల్గుట యభ్యాసము చేయుచుండుటను విడంబించుచుండెను. ఆ యెగురుచున్న దూడల వంక తల్లులు ముట్టెలు వానివైపునకు త్రిప్పి, యప్పుడే పగిలి దూది కనిపించు పచ్చి ప్రత్తికాయలవంటి కనులతో, తదేక ధ్యానవివశములై యుండెను. మూడు పాలదుత్తలు చేతబూని గోపాలకులు యితస్తతః ప్రచార పరిరమ్య మూర్తులు నెడమ చేతులలో బందపుత్రాళ్ళు కలవారు థెయ్, థెయ్ - అనుచుండిన యావులమందను వదలి మెడపలుపుల మొరపిడికి గొంతులు తెగిపోవునో యన్నంత బిఱ్ఱుగాలాగికొను నాదూడల సడలించుట బెట్టిదమయి, కూర్చుండి దూడలను బుజములతో కట్టు కొయ్యలవైపు త్రోయుచు వాని త్రొక్కిడి వలన తొలుత తీసిన పాలదుత్త కొంచె మొడ్డిగిలగా మరల పలుపుముడి యూడదీయ ప్రయత్నించుచుండిరి. ఇంతలో వాని తల్లులు తమ జీవితపరమార్థమంతయు వానికి పాలిచ్చుటే యన్నట్లు తత్పరమార్థ ప్రతీక్షా పరమములయిన నేత్రములతో నిలబడి యుండెను. దూడలు పొదుగులలో ముట్టెల పెట్టి రెండుక్రుమ్ములు క్రుమ్మెనో లేదో గోవులంతలో కుండోధ్నులయ్యెను. బిడ్డల కోసము గోవు చేపిన వేళ నామె శరీరమునందలి పశ్చాద్భాగము వేల్పువీటి యమృతపు బావి ప్రక్కన సర్వజనపిపాసాపనయన దోహలమయిన చలువఱాతికుండలవలె నుండెను. క్రమక్రమముగా సూర్యకిరణారుణ కాంతులు వళక్ష చ్ఛాయలుగా విఱుగజొచ్చెను.
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ: పురాణవైర గ్రంథమాల:1
No comments:
Post a Comment