ముద్ద మందారమ్ము బుగ్గపై నొక్కెనో కమిలిపోయినయట్లు కందిపోయె
లలిఁబారిజాతమ్ము గిలిగింత పెట్టెనో తూఁగాడు కొమ్మనే తూలిపోయె
రాదంచు మోటు పరాచికమాడెనో ముగుద కల్వయు మోము ముడుచు కొనియె
రుద్రజట ముక్త కంచుకా రూఢమయ్యె
చంద్రకాంతమ్ము చిఱునవ్వు సంతరించె
నొక్కఁడొకఁడు స్వభావంబు పిక్కటిల్ల
నబ్జబంధుని బానిసలైన పూలు.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది.
ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశబద్ధులను చేశాడు. అశేష వానరసెన చింతాక్రాంతమయింది. కొన్ని కోతులు, లోపలి గుజ్జు తెల్లగా కనపడేటట్లు మిగలబండిన సీతాఫలపు పండ్లలాగా, పళ్ళను బైటకు పెట్టి, చేతులలో చెక్కిళ్ళ నానించి, గొంతుకు కూర్చొని, చూస్తున్నారు. సీతాదేవి కూడా రామలక్ష్మణులకు ఏ ఆపద రాకుమండా చేస్తే అగ్నిప్రవేశం చేస్తానని మ్రొక్కుకుంది. ఇంతలో, విషయం తెలుసుకొన్న గరుత్మంతుడు అక్కడకు వచ్చి రామలక్ష్మణులను నాగపాశ విముక్తులను చేసి వెళ్ళిపోయాడు. క్రమ క్రమంగా రామచంద్రుడు, లక్ష్మణుడు స్పృహలోకి వచ్చారు. రామచంద్రుడు నిల్చుండి అల్లెత్రాటిని మ్రోయించాడు. వానరసేన ఒక్కసారిగా పులకాంకితమై పోయింది. ఒక్క వానరసేన మాత్రమే కాదు, ప్రకృతి మొత్తం పులకించిపోయింది. ఇంతలో సూర్యభగవానుని అరుణారుణ కిరణాలు మెల్ల మెల్లగా పుడమితల్లిని తాకడం మొదలుపెట్టాయి. ఆ సూర్యోదయ వర్ణనమే ఈ పద్యం లోని భావం.
" చెక్కిలిపై చిటిక వేస్తే కందిపోయినట్లుగా, తామరపువ్వు అనే కాంత నవ్వులు చెరిగిపోసింది. బుగ్గపై నొక్కారా అన్నట్లుగా, ముద్దమందారం కమిలిపోయింది. అతి సుకుమారమైన పారిజాత పుష్పం, ఎవరో గిలిగింత పెట్టినట్లుగా, ఊగుతున్న కొమ్మకే వాలిపోయింది. రానని మోటు సరసమాడినట్లుగా, ముగ్ధ వంటి కలువకన్నె ముడుచుకుపోయింది. రుద్రజట రవిక విప్పుకొన్నట్లుగా పూరేకులను విప్పుకొంది. చంద్రకాంత పుష్పం చిరునవ్వు లొలుకపోసింది. పద్మబాంధవుని బానిసలైన పూలు ఒక్కొక్కటి తమ స్వభావానికి అనుగుణంగా వికసించటం మొదలుపెట్టాయి. "
శ్రీరాముడు అవతార పురుషుడు. శ్రీ మహావిష్ణువు అవతారం. సూర్యమండలాంతర్వర్తి. సూర్యుల కెల్ల సూర్యుడు. అందువలన, నాగపాశం నుండి విముక్తులైన రామలక్ష్మణులను చూసి ప్రకృతి మొత్తం పులకించిపోయింది.
సందర్భానికి తగ్గట్లుగా వర్ణనలు చేయటంలో విశ్వనాథ అందెవేసిన చేయి. ఈ లక్షణం శ్రీమద్రామాయణ కల్పవృక్షము కావ్యమంతా పరచుకొని ఉంది.
No comments:
Post a Comment