వ్యసనమునంది నా దెసకు నైనది, దీనిని గూడ నగ్నితో
డ సరిగఁ జూచెదన్, మృదుకడారము వన్నె నెసంగు దాని దృ
క్ప్రసరము జాలిగొల్పు, ప్రియభార్య వియోగము పుక్కిలింతలై.
పృథు పితృవాక్ప్రియాచరణ విశ్రుతధర్ముడ వీవునున్ మహా
రథుడవు మాననీయుడవు రాజవు సర్వధరిత్రికిన్ బ్రియా
తిథి వరుదెంచినా వనుమతింపుము మత్కృత మర్ఘ్యపాద్యముల్
పృథుల వనాంతవాసమున నెప్పుడు వచ్చెదవంచు జూచెదన్.
సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వచ్చారు. మహర్షి వారిని అగ్నిగృహానికి తీసుకువెళ్ళాడు. అగ్నిగృహమంతా హరిణ సంచారంగా ఉంది. అగస్త్యుడు బ్రహ్మ స్థానంలో బలులు సమర్పిస్తుండగా, ఆయన శిష్యులు, అన్ని అగ్ని స్థానాలలోను బలులు సమర్పిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నంతసేపు తననే చూస్తూ అగ్నిగృహంలో ఒక మూల పడుకొని ఉన్న దుప్పికి, అగస్త్య మహర్షి యజ్ఞార్థం ఉపయోగించిన కృసరం (నువ్వులు, బెల్లం) తినిపించాడు. ఆ తరువాత సుఖాసీనుడైన మహర్షికి, ముగ్గురూ సాష్టాంగ దండప్రణామాలు గావించారు. అప్పుడు మహర్షి వారితో ఇలా అన్నాడు.
" ఇప్పుడు కృసరం (యజ్ఞార్థం వాడిన నువ్వులు, బెల్లం) తిన్నటువంటి యీ దుప్పి, తన తోటి ఆడుదుప్పికి దూరమైనటువంటిది. మిక్కిలి దైన్యస్థితిలో నా ఆశ్రమానికి వచ్చింది. నేను దీనిని అగ్నితో సమానంగా చూస్తాను. ప్రియమైన భార్యా వియోగంతో బాధపడుతున్న గోరోజనం రంగులో ఉన్నటువంటి యీ దుప్పిని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది.
రామచంద్రా ! నీవు పితృవాక్యపరిపాలన అనే మహాధర్మాన్ని చాలా ఇష్టంగా ఆచరిస్తున్న అచంచలమైన దీక్షాపరుడివి, మహాపరాక్రమశాలివి, గౌరవనీయుడివి,సర్వ భూమండలానికి రాజువి. ఇప్పుడు నా ఆశ్రమానికి అత్యంత ప్రియమైన అతిథిగా వచ్చావు. అందువల్ల, నేనిచ్చే అర్ఘ్యపాద్యాదులను స్వీకరించు. గురుతరమైనటువంటి వనవాసాన్ని ముగించుకొని మరల నా ఆశ్రమానికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. "
ఋషులు త్రికాలవేదులు. జరగబోయే సంఘటనలన్నీ వారి దృష్టిగోచరాలే. అగస్త్యుడు చెప్పిన దుప్పి వృత్తాంతం జరగబోయే సీతారాముల వియోగాన్ని సూచిస్తున్నది. ఇక ఆ దుప్పి తనకు అగ్నితో సమాన మనటంలో, అవతారమూర్తియైన రాముడు తనకు ఆరాధనీయుడన్న అర్థాన్ని స్ఫురింపజేస్తున్నది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment