థర నవభావ ధీవిలసనంబులు గాంచి యొకింత యూహయుం
బొరయఁడు కాని యేదొ పనిపుట్టిన నెచ్చట నానుకూల్యముం
బొరయునొ యెందుఁదాఁబొసగఁబోదొ వివేకపుదృష్టిఁ గాంచెడున్.
అరయఁగ దేవతల్ మనుజులందఱు తీవ్రతపంబుచేత మం
థరతమ మాత్మనామక పదార్థము రూపము కట్టుదారి న
బ్బురముగ నూహసేయుచును బోదురు రక్కసు లైహలౌకిక
స్ఫురణలయందుఁ జిత్రములు పుట్టఁగ జేయుదు రంచు నెంచఁగన్.
హనుమంతుడు సీతాన్వేషణలో భాగంగా, లంకాపట్టణం లోని ఇంటింటినీ జల్లెడ పట్టినట్లు గాలిస్తున్నడు. అక్కడ, చూడరాని, చూడలేని దృశ్యాలను చూడవలసి వస్తున్నది. అయితే, పరమ వైరాగ్యభావనామహేశ్వరుడైన మారుతి, తన లక్ష్యం మీది నుంచి దృష్టి మరలనీయకుండా అణువణువూ గాలిస్తున్నాడు. ఆ సమయలో, తనలో ఈ విధంగా అనుకొంటున్నాడు.
" పరమ వైరాగ్యభావన కలిగిన మానవుడు, ఈ దృశ్యమానజగత్తు లోని వేరు వేరయిన, క్రొత్త భావాలతో కూడుకొన్న కామభావనల యొక్క బుద్ధివికాసాన్ని చూసి కూడా, వాటిని ఏ మాత్రం మనస్సులోకి తెచ్చుకోడు. కానీ, ఏదైనా కార్యం సాధించుకోవలసిన అవసరం వచ్చినప్పుడు మాత్రం, అది ఎక్కడ సానుకూలపడుతుందో, ఎక్కడ ప్రతికూలంగా ఉంటుందో, నిశితంగా పరిశీలించి, వివేకంతో విడదీసి చూస్తాడు.
పరిశీలిస్తే, దేవతలైనా, మానవులైనా, కఠోరమైన తపస్సు చేసి, అంతు చిక్కనటువంటి ఆత్మపదార్థ జ్ఞానాన్ని తెలుసుకొనే మార్గమేదా అని తలపోస్తూ ఉంటారు. అదే రాక్షసులయితే, ఇహ లోకంలోని భోగాలను గుర్తుకు తెచ్చుకొంటూ, వన్నె వన్నెలుగా, చిత్ర చిత్రంగా ఊహలు చేస్తూ ఉంటారు. "
రామాయణ మహాకావ్యంలో, సుందర కాండము, అతి చంచలమైన వానరజాతిలో పుట్టిన హనుమ ద్వారా, బుద్ధి నైశిత్యాన్ని, నిత్యజాగ్రదవస్థను, ఇంద్రియనిగ్రహాన్ని, వివేచనాదృష్టిని, అకుంఠిత దీక్షను మానవసమాజానికి నేర్పి, వారిని కార్యోన్ముఖులుగా చేసి , ఆ కాండ పారాయణ యొక్క నిజమైన ఉద్దేశ్యమిది యని తెలియజేసే ఆచరణయోగ్యమైన గ్రంథభాగం. సమాజ మిది గుర్తుంచుకోవాలి..
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment