తో రాణింపదు, స్యూర్యసూతి కది యే త్రోవన్ లభించెన్ మహా
శూరుండాతఁడటంచు నెవ్వఁడు వచించున్ నిన్నుఁగాదంచు నౌ
రౌరా ! కర్మపథంబు నిట్టిదని యేర్పాటున్నదే యిద్ధరన్.
అతఁడేమేమి వచించెనో యవియ యాదార్థ్యంబులన్పించు స
న్మతియున్ దొల్తగ విన్న దాన నభిమానంబూను, నీకున్ నిరా
దృతి, నీవై యనుకొన్నదే నిజము, సుగ్రీవుండునుం దోషిగా
మతికి దోచినదంతియే యతని యే మాట న్నిజంబెన్నకన్.
ఊహ యొనర్ప మంత్రబలమున్నది పెద్దయు సూర్యసూతికిన్
బాహుబలంబు నున్నయది పండితలోక శిరోవిభూషణం
బా హనుమంతుఁడుజ్జ్వలమహామతి తానె రఘుప్రవీరుతో
స్నేహము కల్పియుండును గణింపవు నీవు మఱంతవానినిన్.
భ్రాతృత నిల్పి వాని యువరాజ పదంబును వానికిచ్చి ధా
త్రీతలనాథుఁడైన రఘునాథుని రాకయె నేరనట్లుగా
నీతిని నిల్పు, నిన్నును గణింపడు నీవు గణింప వాతనిన్
సీతను బొంద నింక నెదిచేయునొ కాననవీధులన్ బడిన్.
తార రాజనీతిజ్ఞురాలు, వివేకం కలిగినది. అందుచేత సుగ్రీవుడు కయ్యానికి పిలువగానే, దాని వెనుక నున్నట్టి బలమైన కారణాన్ని భర్త వాలికి చెప్పి, అతడిని వారించటానికి ప్రయత్నిస్తున్నది. తార భర్తతో ఇంకా ఇలా అంటున్నది.
" ఆ రాముడు మొట్టమొదట నీ దగ్గరకు రాకపోయెను. వచ్చినా, నీ స్వభానికి అతనితో స్నేహం కుదరదు. సూర్యపుత్రుడైన సుగ్రీవునితో అతనికి స్నేహం ఏ విధంగా కుదిరింది? నిన్ను కాదని, సుగ్రీవుడు నీకంటె మహాశూరుడని ఎవరైనా అనగలరా? ఏదియేమైనా, ఈ భూమి మీద, జరగవలసిన పనులు యీ త్రోవలో, యీ విధంగా జరుగుతాయని ఏర్పాటంటూ ఏమైనా ఉన్నదా?
ముందుగా సుగ్రీవుడు తనను కలిసి తన గోడు వినిపించిన కారణం చేత రాముడికి అతని మీద అభిమాన ముంటుంది. అందుచేత, అతడు ఏమేమి చెప్పాడో అవన్నీ నిజమని రాముడికి అనిపిస్తుంది. నీమీదేమో నిరాదరణ ఎక్కువవుతుంది. ఇక నీ సంగతి చూస్తే, సుగ్రీవుడు చెప్పిన మాటల్లోని యదార్థాన్ని పట్టించుకోకుండా, నీ వనుకొన్నది, నీ బుద్ధికి తోచిందే నిజమనుకొని, సుగ్రీవుడిని దోషిగా నిలబెట్టావు.
నిదానంగా ఆలోచించటానికి తగినంత మంత్రాగం, ఊహాశక్తి, బుద్ధిబలం సుగ్రీవుడి కున్నాయి. బాహుబలంలో కూడా అతనేం తక్కువాడు కాదు. మహాపండితుడు, బుద్ధిమదగ్రగణ్యుడైన హనుమంతుడే యీ స్నేహాన్ని కుదిర్చి ఉంటాడు. మరి అంతటి వాడిని కూడా నీవు లెక్కచేయవు.
సోదరధర్మాన్ని పాటించి, అతడి యువరాజపదవి అతడి కిచ్చి, అసలు రాముడు ఇక్కడకు వచ్చిన సంగతే తెలియనట్లుగా రాజనీతిని ప్రదర్శించు. ఈ పని చేస్తే అతడు నిన్ను పట్టించుకోడు, నువ్వు కూడా అతనికి పట్టించుకోవు. ఇక అడవుల్లో పడి సీతాన్వేషణకు ఏం చేయాలో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. "
విశ్వనాథ గొప్పతనం ఎక్కడున్నదంటే, తార హితోపదేశం, ఊరకే బాహుబలాన్ని నమ్ముకున్న వాలి తల కెక్కకపోయినా, పాఠకుల హృదయాల్లో తార యెడల అభిమానాన్ని పెంచుతుందనటంలో సందేహం లేదు. తార పలికిన హితవాక్యాలు ఒక పరిణతి చెందిన రాజనీతిజ్ఞురాలి మాటల వలె ఉన్నాయి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment