ఘనమౌ మానవవృత్తమున్ నడిపి శాఖావృత్తమొక్కండు క
ల్గిన దోసాన మృగాలమౌదుమె శరక్రీడాసమారూఢ దు
ర్జనరేఖావ్యసనుండుకాక హితకార్యక్లేశవృత్తుండునై.
నీవు కులాచలేంద్ర సమ నిశ్చలదేహబలుండ వద్రి నీ
పై విసరన్ మఱిం గదలఁబాఱవు తాదృశుఁడయ్యుఁ గూడ నో
హో వెస సప్తదాళదళనోగ్రము బాణము నెంచ గుండెలో
నావులు తేరు నిల్వగలవా ! రఘురాముని యంపఱివ్వునన్.
నీవే యుద్ధము చేయబోయినను గానీ నేను భీతిల్ల సు
గ్రీవుల్ వందలు వచ్చినన్ భయపడన్ శ్రీరాముఁడచ్చోట నే
దో వృక్షంబును జాటు చేసికొని దూయున్ బాణ మేవేళనో
యా వేళన్నినుఁగాచుకోఁగలుగు నూహంజేయలేనయ్యెదన్.
తార సుగ్రీవుడితో యుద్ధానికి సన్నద్ధమౌతున్న వాలిని వారించి, అతడికి హితోపదేశం చేస్తున్నది.
" మనం కూడా మానవుల లాగానే ఉన్నాము కదా ! వారి వలే మాట్లాడగలుగుతూ, ఆలోచించ గలుగుతూ, గొప్ప బుద్ధిబలాన్ని ప్రదర్శిస్తూ, చెట్లమీద నివసించేవారం అన్న ఒక్క దోషం చేత, జంతువుల మౌతామా? రాముడు తన చాపవిద్యను ప్రదర్శించాలనే దుర్వ్యాసంగం చేత నిన్ను చంప నెంచటం లేదు. హితుని యొక్క పనిని చేసిపెట్టటమనే గురుతర బాధ్యత మీదవేసుకొన్నాడు.
నీవు కులపర్వతమంత దేహబల మున్నవాడివి. పర్వతాన్ని నీ పైన విసిరినా, నీవు కొంచెమైనా చలించవు. అటువంటివాడివైనా కూడా, ఏడు తాటిచెట్లను కూకటివ్రేళ్ళతో పెకలించిన భయంకరమైన బాణం నీ గుండెను దహిస్తే, ఆ రఘురాముని యొక్క శరతీవ్రతను నీవు తట్టుకోగలవా?
నీవు ఏ యుద్ధానికి వెళ్ళినా నేను భీతిల్లలేదు. వందమంది సుగ్రీవులొచ్చినా భయపడను. కానీ, రాముడు ఏదో ఒక చెట్టును చాటుగా చేసుకొని, ఏదో ఒక సమయంలో బాణం వేస్తాడు. మరి అటువంటి సమయంలో నిన్ను నీవు ఏ రకంగా రక్షించుకొంటావో ఊహించుకోవటానికి కూడా కష్టంగా ఉంది. "
తార మాట్లాడిన తీరు చూస్తే, ఒక వైపు వాలిని గూర్చి ఆందోళన, ఇంకొక వైపు శ్రీరాముని యొక్క అతిలోక సామర్థ్యాన్ని తన భర్త గ్రహించటం లేదన్న ఆవేదన ద్యోతకమౌతున్నాయి. తాము కేవలం శాఖామృగాలము కాదన్న విచక్షణలో, రాముడు చేయబోయే పని ధర్మ విరుద్ధం కాబోదన్న హెచ్చరిక కూడా దాగి ఉంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment