క్షాయుతు దర్శనము చేయఁగా నేగెదరా
యాయన మీరెప్పుడు వి
చ్చేయుదురని యెదురుచూచు శ్రీయుతులారా !
ఏ పూట పడిన మీరలు
నా పూటనె వత్తురంచు ననుకొనుచుంటిన్
మీ పయనపుబడలిక పో
నోపిక స్నానములు చేయుఁడున్నవి జలముల్.
నేను బ్రహ్మచారి నెట్టులా ! తల్లి వ
చ్చెడు నటంచు నేను సేగిపొందఁ
బొరుగుగాలవుఁ మునిభార్య నాకంటె
తొందరించి తాను తోడువచ్చె.
పద్య మెప్పుడైనా మనతో మాట్లాడుతుందా? పద్యం మనతో మాట్లాడిన అనుభూతి పద్యం చదువుతున్నప్పుడు కలుగుతుందా? విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షములో, పలు తావుల్లో పాఠకునికి యీ అనుభూతి కలుగుతుంది.
ఆ కోవకు చెందినవే శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని అందమైన యీ రెండు కాంద పద్యాలు, ఒక ఆటవెలది.
రామాయణంలో మనం అగస్త్యభ్రాత అనే పేరు వింటుంటాము. ఆయన అగస్త్యునికి సోదరుడని తెలుసు గానీ ఆయన పేరు తెలియదు.
రామలక్ష్మణులు, సీతతో కలిసి, దక్షిణ దిక్కుగా పోసాగారు. దారిలో శరభంగుడు, సుతీక్ష్ణుడు వంటి ఎందరో మునులను దర్శనం చేసుకొన్నారు. అగస్య్త మహర్షి దర్శనార్థం పోతూ, దారిలో అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చారు. ఆ మునీశ్వరుడు రామలక్ష్మణులతో మాట్లాడిన సారాంశమే ఈ పద్యాల లోని భావం. అగస్త్యభ్రాత రామలక్ష్మణులతో ఈ విధంగా అంటున్నాడు.
" వింధ్యపర్వత గర్వాపహారి, మహానుభావుడైన, అగస్త్యుడు మహర్షి దర్శనం కోసం వెళ్తున్నారా? చిరంజీవులారా ! ఆయన మీ రెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాడు నాయనా !
ఏ పూట కా పూట మీరొస్తారని అనుకొంటున్నాను. అవిగో కావలసినన్ని నీళ్ళున్నాయి. మార్గాయాసం తీరేటట్లుగా, ఓపికగా, స్నానం చేయండి.
నేను చూస్తేనా బ్రహ్మచారిని. సీతమ్మ తల్లి వస్తుంది ఎట్లాగా అని బాధపడుతుంటే, పొరుగున ఉన్న గాలవుడనే మునీశ్వరుని భార్య, నా కంటె కూడా ఎక్కువగా ఆందోళన పడి, అన్నీ సిద్ధం చేసింది. "
స్నానాదులయిన తరువాత, అగస్త్యుడు సోదరుడు, వారికి భోజనాదికాలు ఏర్పాటు చేయించాడు.
పైన పేర్కొన్న పద్యాల వంటివి కల్పవృక్షములో కొల్లలుగా కనిపిస్తాయి. అవి హృదయం లోనికి నేరుగా చొచ్చుకొని పోయి, మనమే ఆ సంభాషణను నెరుపుతున్న అనుభూతిని పొందుతాము. అది విశ్వనాథ పద్యరచనాశిల్పం లోని ఒక విశిష్టత.
No comments:
Post a Comment