మకటకటా ! వాని మూర్తి యందున మొగమం
దొక తీర్చు వేస మందున
నొక కట్టిన యింటి యందు నొప్పారు నహో !
ఈ యిల్గే స్తెవఁడో సుధాప్రకృతి సాహిత్యంబు దీపించు దై
తేయు ల్గీములు సాధుదర్శనముగా దీపింప వీ యిల్లు కం
దోయిన్ వెన్నెలతీవతోఁటవలె సంతోషింపఁ జేయున్ ది
దృక్షాయోగ్యంబుగఁ జూచినంత నెదలో శాంతి ప్రచారంబుగన్.
హనుమ తనలోన నిట్లనుకొనియె నమిత
దుష్టమైనట్టి జాతి యందు నను బుట్టుఁ
జెదురుగా నొక్కఁడతి సాధుశీలి యాత్మ
శాలి చిత్ర మీ జీవసంచార మంచు.
హనుమ లంకాపురిలో సీతాన్వేషణ చేస్తున్నాడు. వీధి వీధినా తిరుగుతూ ఇంటింటినీ పరిశీలిస్తున్నాడు. ఒక ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి, తక్కిన ఇళ్ళకు భిన్నంగా, ప్రశాంత వాతావరణం కనిపించింది. ఆ సౌధంపై తెల్లని వెన్నెల కాస్తుండగా, చల్లని గాలులు వీస్తున్నట్లుగా, పొందికగా ఉండి, చూడటానికి కన్నులపండుగగా ఉండి. హనుమ ఇలా అనుకొన్నాడు.
" ఆహా ! ఒక జీవి యొక్క ఆత్మలక్షణం, అతని రూపం లోను, ముఖం లోను, వేషధారణ లోను, కట్టుకొన్న ఇంటి లోను కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా !
ఈ ఇంటి యజమాని యెవరో గానీ, మధుర మంజుల ప్రకృతి కలవాడై ఉండాలి. రాక్షసుల ఇళ్ళు సామాన్యంగా సాధుప్రకృతికి విరుద్ధంగా ఉంటాయి. ఈ ఇంటిని చూస్తుంటే వెన్నెల తీగ లల్లుకొన్న తోట లాగా కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తున్నది. చూడటానికి యోగ్యంగా ఉండి, హృదయంలో శాంతిని నెలకొల్పుతున్నది.
చాలా దుర్మార్గపు జాతిలో కూడా అప్పుడప్పుడు అత్యంత సాధు స్వభావం కలవాడు, ఆత్మజ్ఞానం వికసించినవాడు పుడతాడు. నిజంగా, ఈ జీవ జగత్తు యొక్క నడక చాలా చిత్రమైనది. "
హనుమ, తన అన్వేషణలో భాగంగా చూసింది పరమ భాగవతోత్తముడైన విభీషణుని ఇల్లు. ఆ కారణంగానే, భక్తాగ్రేసరుడు, సాధుపుంగవుడైన హనుమకు విభీషణుని గృహపరిసరాలు ఎంతో ప్రశాంతంగా కనిపించాయి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment