వృద్ధులకు వయసుమీరిన కొలది కొన్ని పట్టుదల లెక్కువగును. కొన్ని యాచారములయందు, కొన్ని సంప్రదాయముల యందు, కొన్ని నియమముల యందు, వారి కధిక ప్రత్యయము కలుగును. చిన్నప్పుడు జీవితములోని యనుభవజగత్తు క్రమవికాసము పొందుచు తత్తదనుభవవిశేషముల యందు మనస్సు ప్రసక్తమై భోగలాలస మనస్సు నాక్రమించి యుండును. ఆ యనుభవము మిక్కుటమై జీవితములోని యొడిదుడుకు లనుభూతిదశకు వచ్చి తదాభిముఖ్య ముపసంహరింపబడి శరీరానుభవ భావరేఖా ప్రత్యగ్రత సన్నగిలినపుడు దేహి యొక్క మనస్సు సంప్రదాయముల యందు లగ్నమయి యుండును. జీవునకు తెలియకుండగనే మృత్యువు సమాసన్నమగుచున్న లక్షణము బుద్ధికి భాసించుచుండును. ఆ బుద్ధి కొన్ని యాచారముల యందు, కొన్ని విశ్వాసముల యందు, దృఢముగా తగుల్కొని యచ్చట రమించుచుండును. ఈ రమణము కూడ తనకు పరిచితములైన విషయముల యందే కలుగును.
భారతీయ జాతులలో నుత్తమ వర్ణముల వారియందుకంటె నపరవర్ణముల వారియందు సంప్రదాయాభిమాన మెక్కువ యుండును. ఉత్తమ వర్ణములవారు శాస్త్రములు చదివి తర్కపద్ధతి యలవాటై వారి సొంత యూహలు వారు చేయుచుందురు. అపర వర్ణములవారు శాస్త్రగత చర్చానిరూఢులు కాక విషయములను స్థూలముగా తెలిసికొని వానియందు బద్ధాదరులై యుండురు.
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: భగవంతుని మీది పగ : పురాణవైర గ్రంథమాల:1
No comments:
Post a Comment