యొక గ్రుడ్డు, లగ్నమం దుండఁగా శుక్రుండు మూఁడవరాణికి భూమిపాలు
ప్రియతమ కాంతకుఁ బేర్చి పంచమము బుద్ధిస్థాన మమృతాంశు దేవగురుల
యునికి, నిర్వీచియౌ నుదధివోని పరమశాంతస్వభావుండు జననమందె.
రాజు పరువెత్తి చని కుమారకుని లోచ
నాభిరామమూర్తిని జూచు నంత బ్రమసె
బిగియు కళ్యాల సృక్వముల్ పగలి సూర్య
రథతురంగమముఖముల రక్తిదోచె.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోని పద్యం.
" దశరథుని యొక్క మూడవరాణి, ప్రియభామకు, నాచుతో కప్పబడినట్టి శంఖం వంటి ఒక పసిగుడ్డు, మగశిశువు, మీనలగ్నంలో, లగ్నంలో శుక్రుడు, బుద్ధిస్థానమైన పంచమంలో చంద్రుడు, దేవగురువైన బృహస్పతి కొలువుండగా, వాయుప్రసారం లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రంలాగా, పరమశాంతస్వభావుడు పుట్టాడు.
ఆ వార్త వినగానే రాజు పరుగెత్తుకొంటూ వెళ్ళి, నేత్రానందంగా ఉన్న కొడుకుని చూసుకొన్న సమయంలో, సూర్యుని యొక్క రథానికి కట్టిన గుర్రాల కళ్ళాలు బిగిసి, వాటి సెలవుల (పెదవుల) వెంట కాంతులు విరజిమ్ముతూ తెల్లని నురుగు కారటం మొదలుపెట్టి, ఆ గుర్రాల ముఖాలలో ఒక చిత్రమైన వర్ణం కనపడింది. అంటే, సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. "
ఈ పద్యం పరమ భాగవతోత్తముడైన భరతుని జననాన్ని తెలియజేస్తున్నది. ఇష్టిఖండం ప్రారంభంలో చెప్పినట్లు, పరమపుణ్యశీలయైన కైకేయి మధుసామగానమూర్తికి జన్మనిచ్చింది. ఆయన శైవాలపిహితమౌ శంఖం వంటివాడు. శైవాలము అంటే నాచు. పిహితము అంటే కప్పబడటం. అంటే, రాముని వలె నీలవర్ణ దేహచ్ఛాయ కలవాడు. రాముని గుణాలను పుణికి పుచ్చుకొన్నవాడు. ఈ శిశువు ' లోచనాభిరాముడు ' . ప్రథమ శిశువెంతటి మనోజ్ఞ, మంజుల, మర్యాదా సంపన్నుడు కానున్నాడో, ఈయన కూడా అంతటివాడనదగిన ఆయన ప్రతిరూపము.
No comments:
Post a Comment