నా దైవంబులు మూటకట్టికొని యైనాడా మహాస్వామి
పెంపేదం బౌరుష మాశ్రయించి చనగా నేమౌను శ్రీరాఘవుం
గోదండోగ్రుని ముందు నిల్చుటకు నీకున్ సాధ్యమా చెప్పుమా.
ఏనొక్కండు వచింతు నిశ్చితముగా నేర్పాటుగా శౌర్యపా
రీణంబైనది వచ్చి పిల్చినది సుగ్రీవుండె యా వెన్క నే
డో నారాచనిగూఢుడుండికద యా యూతంబడిన్ వచ్చె దా
గానన్ వాని నెదుర్చు మూతను పరిష్కారంబుగా సర్వమున్.
ఇవి రెండే తుదకున్ వినిశ్చితములై యేపారు సుగ్రీవునిన్
యువరాజుం బొనరించి శత్రుతకు స్వస్త్యుత్క్రాంతులం జెప్పుటో
ప్రవిభక్తంబగు శౌర్యదీపనముగా రామున్ ఘనశ్యాము నా
హవ రంగము నందెదుర్చుటయొ వీరానీక సంశ్లాఘ్యమై.
అదియున్ నీకును రామచంద్రునకు బ్రత్యక్షంబు వైరంబు లే
దెదురై పోరడు దాన రాము డటులే యీవున్, మఱే చెట్టునో
మదుగై నిన్ను వధించు దాని కదియున్ మర్యాదయై పొల్చు తా
నదియే హేతువుగాగ నీవతనిమాఱై పోరవచ్చుం జుమీ.
ఈ మాటలు సుగ్రీవుని
తో మాట్లాడుము బహిర్గతుండగు నతడున్
రాముండేమనునో సు
త్రామసుతా ! యిట్లు పోవఁదగ దెవ్వరికిన్.
వాలి భార్య తార ఎంతో వివేకం, విచక్షణాజ్ఞానం కలిగిన స్త్రీమూర్తి. అందుచేత, సుగ్రీవుడు యుద్ధానికి పిలవగానే, పలుమార్లు తన భర్త చేతిలో దెబ్బలు తిన్న సుగ్రీవుడి ఔద్ధత్యానికి వెనుక నున్నట్టి కారణాన్ని గ్రహించి, వాలిని తొందరపడవద్దని హితవు పలికింది. పైపెచ్చు, ధర్మపరులు, ధర్మ పరిరక్షకులైన ఇక్ష్వాకువంశానికి చెందిన రాముని మహత్వాన్ని ఆమె సంపూర్ణంగా ఆకళింపు చేసుకొన్నది. ఆమె వాలితో ఇంకా ఇలా అంటున్నది.
" ఓయి ఇంద్రతనయుడా ! ఇప్పుడు ఏ దైవాన్ని వచ్చి నిన్ను కాపాడమని నేను ప్రార్థించాలి. ఎందుకంటే, ఆ మహనీయుడేమో సర్వదేవతా స్వరూపం. నీవేమో పురుషత్వాన్ని మాత్రమే నమ్ముకొని ఆయనతో యుద్ధానికి వెళ్తే ఏమౌతుంది? ఆ కోదండరాముని ముందు నిలవటం నీకు సాధ్యమా?
నేనొక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. యుద్ధానికి రమ్మని వచ్చి పిలిచింది సుగ్రీవుడే అయినా, ఆయన వెనుక ఎవరో గొప్ప ధానుష్కుడు ఉండటం వల్ల కదా అతడు దానిని ఊతంగా చేసుకొని వచ్చాడు. అందుచేత, ఎవరి ఊతంతో అతడు నిన్ను ఎదుర్కొంటున్నాడో, ఆ ఊతాన్నే యీ సమస్య మొత్తానికి పరిష్కారంగా భావించి, నీవు కూడా సుగ్రీవుడిని ఎదుర్కోవాలి.
అందువల్ల, నాకు రెండే రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, సుగ్రీవుడిని యువరాజును చేసి శత్రుత్వానికి ముగింపు అయినా పలకాలి. లేకపోతే, నీ శౌర్యపరాక్రమాలకు తగ్గట్లుగా, వీరులు మెచ్చుకొనేటట్లు, శ్రీరాముడిని యుద్ధరంగంలో ఎదుర్కోనైనా ఎదుర్కోవాలి.
ఇక అందులో కూడా, నీకు రాముడికి ప్రత్యక్షంగా విరోధం లేదు. అందువల్ల, ఆయన నీతో ప్రత్యక్ష యుద్ధం చేయడు. నువ్వు కూడా అంతే. ఏదో ఒక చెట్టు చాటు నుంచి ఆయననిన్ను చంపుతాడు. దానికది ధర్మబద్ధంగానే కనిపిస్తుంది. నీవు కూడా యీ అంశాన్నే ఆధారంగా చేసుకొని, నీకు మారుగా ఇంకొకరు సుగ్రీవునితో యుద్ధం చేయవచ్చు.
ఈ మాటలు సుగ్రీవుడితో చెప్పు. అప్పుడతడి మనసులో మాట కూడా బయటపడుతుంది. రాముడు కూడా ఏమంటాడో తెలుస్తుంది. అంతేకానీ, తొందరపడి యీ రకంగా యుద్ధానికి పోవటం ఎవరికీ మంచిదికాదు. "
ఈ పద్యాలు చదివితే, తార ఎంత రాజనీతి తెలిసిన స్త్రీయో, ఎంతటి ఆలోచనాపరురాలో, ఎంతటి దూరదృష్టి కలదో అర్థమౌతుంది. అటువంటి తార పాత్రను అత్యద్భుతంగా మలిచిన విశ్వనాథ ఎంతటి మహాశిల్పియో చెప్పనక్కరలేదు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment