శార్ఙములు లేని యా నీరజాతభవుడు
స్వాభిమతకర్మ శాపాయుధాయుధుండు
తన మహాయుధరాజంబు దరిసియనియె
పరమ మాహేశ్వరుండవు పరమవైష్ణ
వుండవు నగస్త్య ! నీ కనుబొమలు రెండు
శార్ఙము పినాకమును దపసంభృతాత్మ
చటుల మామక శాసనశక్తి వీవు.
బలి తలమీఁదఁ జిన్ని హరిపాదపు గుర్తులు వింధ్యపర్వతో
పల శిఖరాన నీదుముని పాదపుగుర్తులు రెండునున్ జగ
త్ప్రళయ నివారకాభయ నిదాన నికేతన మోహనాంశులై
వెలిగెడు సాధు సౌరపదవీ నదవీయసమైన సత్కృపన్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని యీ పద్యాలు సప్తఋషుల్లో మేటి అయిన అగస్త్యుని గురించి బ్రహ్మ చెప్పిన మాటలను తెలియజేసేవి.
" అటు త్రిశూలం సుదర్శనం గానీ, ఇటు పినాకం శార్ఙం గానీ లేనటువంటి పద్మసంభవుడు, తాము చేసిన కర్మలనే శాపములనే ఆయుధములుగా మలచేటటువంటివాడు, అయిన బ్రహ్మదేవుడు, తన గొప్ప ఆయుధం అగస్త్యుడిని చూసి ఇలా అన్నాడు.
" అగస్త్యా ! నీవు పరమ శైవాచారపరుడివి, అలాగే పరమ వైష్ణవుడివి కూడాను. నీ రెండు కనుబొమలలో, ఒకటి శార్ఙము, రెండవది పినాకము. మహాతపశ్శక్తి సంపన్నుడవైన నీవు నా యొక్క శాసనశక్తివి.
బలి చక్రవర్తి తల మీద వామనుడు పెట్టినటువంటి పాదపు గుర్తులు, వింధ్యపర్వతం గర్వాన్ని అణచటానికి మునీశ్వరుడివైన నీవు పెట్టిన పాదపుగుర్తులు, జగత్ప్రళయాన్ని నివారిస్తూ, అభయాన్ని ప్రసాదిస్తూ, ఉజ్జ్వలంగా ప్రకాశించే నివాసాలు . నీ దయ వలన సజ్జనులు, దేవతలు సుఖంగా ఉంటారు. "
అగస్త్యుడు సప్తఋషుల్లో అగ్రగణ్యుడు. ఆయన తపస్సు వెచ్చించి చేసే పనులన్నీ జగత్కళ్యాణకారకాలే. ఆయన పరమ మాహేశ్వరుడు, పరమ వైష్ణవుడు కూడాను. శాపాన్ని ఆయుధాలుగా కలిగిన ఆయన కనుబొమలు ఒకటి శ్రీమహావిష్ణువు యొక్క ధనుస్సు శార్ఙము, రెండవది శివుని విల్లు పినాకము వంటివి. విష్ణువు, శివుడు, వీరిద్దరే ఈ జగత్తుకు ప్రభువులు. జగత్కళ్యాణకారకులు. అటువంటి వాడే అగస్త్యుడు అని బ్రహ్మ భావన.
మొదటి పద్యంలో ' త్రిశూల సుదర్శనంబులు, పినాక శార్ఙములు ' అని శివుని యొక్క, విష్ణువు యొక్క ఆయుధాలను ఒక క్రమంలో చెప్పిన బ్రహ్మ (కావ్యానేక బ్రహ్మాండ స్రష్ట విశ్వనాథ), క్రమాన్ని మార్చి " పరమ మాహేశ్వరుండవు పరమ వైష్ణవుండవు నగస్త్య ! నీ కనుబొమలు రెండు శార్ఙము పినాకమును " అని చెప్పాడు. అందుచేత, త్రిమూర్తులలో ఒకడైన చతుర్ముఖబ్రహ్మకు గానీ, విశ్వనాథకు గానీ, శివకేశవుల యెడల భేదము లేదు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము ద్వైతాద్వైత మార్గాల్లో రచింపబడిన మహాకావ్యం.
No comments:
Post a Comment