శ్రీరంగనాథుని సేవింప మడిఁగట్టి మంథర వలదన్న మానివేయుఁ
గౌసల్యఁగనఁబోవఁగా బండిఁ బిలిపించి వగ్గు కాదన్నచోఁ బంపివేయుఁ
గోర్కి సింగారించుకొని పతిఁ గలయఁగా దాది కిష్టములేదొ తగ్గిపోవు
తల్లి నెఱుఁగని దోషమ్ము తగిలి కైక
కన్నతల్లి జూడని మమకార నెల్ల
దన్నుఁ జేతులఁ బెంచిన దాదిమీఁద
నొలుకపోయును గుండెలో నులికిపడుచు.
మడికట్ట వలదన్న మంథర మన్నించి నాతి లోలో రంగనాథుఁ గొలుచు
దాది యొత్తిడి మహాధనచేలములు గట్టి కాంత కాషాయముల్ కాంక్ష సేయు
ముసలి రత్నాసనమ్మును వీడనీయమిఁ బాదుకల్ తొడిపోవఁ బడఁతి యెంచు
నడి వగ్గు నదుపులు సగ మిష్టమై కాక యతివ నే నిందుండ ననుచుఁ బలుకు
నెపుడొ మంథర మాటకు నెదురు తిరుగు
నొక్కొకప్పుడు మంథర కొదిగియుండు
నెంత గొడ్డమ్ములైన నా యింతి యెడఁద
బ్రభువు శ్రీరంగనాథుండు పాయకుండు.
ఈ రెండు సీస పద్యాలు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము లోనివి.
మంథర కైకేయి అరణపు దాది. కైకేయి పాత్రలో రెండు పార్శ్వాలున్నాయి. బాహ్యంగా, చిన్నతనం నుండి తనను పెంచి పెద్దజేసిన మంథర యొక్క ప్రభావం అందులో ఒకటి కాగా, రెండవది అంతర్గతంగా ఆమె కున్న హృదయసౌశీల్యం. ఈ రెండు పద్యాలూ ఆ విభిన్నాంశాలను ఆవిష్కృతం చేస్తున్నాయి.
" నుదుటి మీద కస్తూరి తిలకం చక్కగా పెట్టుకొని, ముసలామె వద్దంటే తుడిచేస్తుంది. శ్రీరంగనాథుని పూజ కోసమని మడి గట్టుకొని, మంథర వద్దనగానే మానివేస్తుంది. అక్కగారు కౌసల్య దగ్గరకు పోవటానికి రథాన్ని సిద్ధం చేయించి, పండుముసలి వెళ్ళొద్దనగానే, బండిని తిరిగి పంపివేస్తుంది. కావాలని అలంకరించుకొని భర్తను కలవటానికి పోతుంటే, దాది కది ఇష్టం లేదనగానే ఊరుకుంటుంది. తల్లిని చూడని దోషం తగిలి, కన్నతల్లి మీద మమకార మంతా, తనను చేతుల మీద పెంచిన దాది మీద ఒలకబోస్తుంది. కానీ గుండెలో ఉలికిపడుతుంది. "
కైక మంథర మాటను కాదనలేదు, అలాగని, అంతర్గతంగా తన ఇష్టాన్ని చంపుకోలేదు. అందుకే, కైకకు గుండెలో ఆ ఉలికిపాటు.
" మడి కట్టుకోవద్దన్న మంథర మాటను గౌరవిస్తుంది కానీ, మానసికంగా శ్రీరంగనాథుని స్మరణ చేస్తుంది. దాది ఒత్తిడి మీద వెల గల చీరలు కట్టుకుంటుంది గానీ, లోపల మాత్రం కాషాయవస్త్రాలు కట్టుకోవాలనుకుంటుంది. ముసలిది రత్న సింహాసనాన్ని దిగనీయదు గానీ, ఈమెకు మాత్రం పాదుకలు తొడుక్కొని పోవాలని ఉంటుంది. వృద్ధురాలు పెట్టే అదుపాజ్ఞలు సగం ఇష్టమై, సగం ఇష్టం లేకుండా ఉన్న కైక, తానక్కడ ఉండనని వెళ్ళిపోతానంటుంది. అప్పుడప్పుడు మంథర మాటకు ఎదురు తిరుగుతుంది, ఒక్కొక్కప్పుడు ఆమె చెప్పినట్లే చేస్తుంది. కైకేయి ఎంత బిరుసుగా ఉన్నా, ఆమె హృదయంలో మాత్రం శ్రీరంగనాథుడు విడవకుండా ఉన్నాడు. "
రెండవ పద్యం లోని విశేష మేమంటే, కైకేయి యొక్క నిరాడంబరత, కాషాయం మీద, పాదుకల మీద మక్కువ, హృదయగత శ్రీరంగనాథ సేవ, పరమ భాగవతోత్తముడు భరతుని జననాన్ని సూచిస్తున్నాయి.
ఈ పద్యాలు కైకేయి ఆత్మగత సౌందర్యాన్ని, సౌశీల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి మున్ముందు కైకేయి పాత్రను సహృదయంతో అర్థం చేసుకోవటానికి బాగా ఉపయుక్తమౌతాయి.
No comments:
Post a Comment