యోజన్ వచ్చెను నేఁటికిన్ దిరిగి యోహో ! వాడె వీఁడయ్యెనో
రాజై స్వీయగృహమ్ములన్ వెలుఁగు నీ రాముండు, చంద్రుండు తా
రాజై రాజు నెడంద రాజయి రసారాముండుగా వెల్గెడిన్.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనిది.
రాముడు పుట్టినప్పటి నుండి దశరథుని ఆనందానికి అవధులు లేవు. అతని మనసు మనసులో లేదు. మనసు నిండా రాముడిని చూడాలన్న కోరిక నింపుకొని, రాముడిని నయనాభిరామచంద్రుడని అనుకొంటూ పోతాడు. ఒక్కొకసారి లోపల శతశోభిరామచంద్రుడు అనుకోంటూ పోతాడు. హృదయంలో తొక్కిసలాట పడుతూ, అంతలోనే రామచంద్రు డనుకొంటూ పోతాడు. ఈ విధంగా రాముడిని గురించి ఊహలు అతడి హృదయక్షేత్రాన్ని నూర్పుడి చేస్తూ తూర్పారపడుతున్నాయి. అంతలో చంద్రోదయమయింది. ఆ చంద్రోదయ వర్ణనను జ్యోతిష్య శాస్త్రాన్ని ఒకింత జోడించి విశ్వనాథ అద్భుతంగా చేశారు.
" తాను యాగం చేయటానికి సన్నాహాలు చేస్తున్నప్పటి నుంచి చంద్రుడు ఇక్కడ తారాడటం మొదలుపెట్టాడు. ఆహా! ఇన్నాళ్ళకు మళ్ళీ ఈ వంక బెట్టుకొని వచ్చాడు. అసలు ఆ చంద్రుడే యీ రామచంద్రుడా? ఆ చంద్రుడే తన స్వస్థానంలో తిరగటానికి రాజై యీ రామచంద్రు డయ్యాడా? చంద్రుడు తాను రాజై, రాజు మనసులో రాజై, ఆనందమనే అమృతపు జల్లులు కురిపిస్తూ రసారాముడిగా వెలుగొందుతున్నాడు. "
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని స్వస్థానం కర్కాటక రాశి. శ్రీరాముని జన్మకుండలి ప్రకారం, " కర్కాటకమున లగ్నమున స్వస్థానమందమృతాంశుఁడుండె బద్ధాంజలి యయి " అనటం మూలాన, చంద్రుడు రాజై రామచంద్రుడుగా స్వీయగృహoలో వెలుగుచున్నట్లయింది.
రాజు అంటే చంద్రుడు, దేశాన్ని పరిపాలించే ప్రభువు అని రెండర్థా లున్నాయి.
No comments:
Post a Comment