తిరి చని యామెతోఁ బలికితిన్, నను నా యమ చూచినట్లు భా
సురలగుఁ దల్లులం దెవరు చూతురు? నేననఁ జచ్చిపోవునే !
సరి సరి యామె, యీ విలయసంగతి కాయమ యెట్లు హేతువౌ?
నీ కంటెన్ మఱి రెండు మల్పులు ధనుర్నిర్ణేతృతాధిక్యమున్
నా కున్నన్, బినతల్లి కైకయి కదన్నా ! చేసె, నీ శౌర్యమున్
నీ కోపమ్మును, నీవు నా కగుటయున్ నేరంగనే పోవదా?
యా కైకేయియు, నిట్లు చేసిన దదేలా ! యింత విజ్ఞాత్రియై.
యిది యెవ్వరు చేయలే దెవరు చేసి
రందు ! దైవమ్ము చేసెఁ గృతాంతుడన్న
నెంతటి బలీయుడో ! మహాఋషులు కూడా
నతనికి లొంగిపోయిరటన్నఁ జూడు.
ఊహకు నందనట్టిదియు నుర్విని దైవమటందు, మింత సం
దేహము నన్ను గూర్చియును, నిక్కపుఁ దల్లినిఁ గూర్చి, యేటికిం
బోహళమందు దైవమను మొక్కలమై చను శక్తిగాక, తా
నై హవణించు దైవమున కడ్డము నీవును నేన? చెప్పుమా !
సౌఖ్యమును సేగి, లాభనష్టములు, భయము
క్రోధము, భవము నభవము, క్రూరమైన
దైవకర్మ, లకస్మాకృతంబులును న
నూహితంబులు దైవంబు నుగ్రకృతులు.
శ్రీరామచంద్రుడు యువరాజు అవటానికి బదులు, కైక కోరిన వరాల ఫలితంగా వనవాసానికి వెళ్ళబోతున్నాడన్న వార్త విని లక్ష్మణుడు కోపోద్రిక్తుడయ్యాడు. అతడిని శాంతింపజేస్తూ రాముడు ఉచితానుచితాలను బోధించాడు. పినతల్లి కైకమ్మను గురించితన మనసులో నున్నట్టి ఆరాధనా భావాన్ని ఇలా బహిర్గతం చేశాడు.
" నా పినతల్లి నా మీద వైరభావం పూనిందంటే ఎవరైనా నమ్ముతారా? రాత్రి కూడా వెళ్ళి ఆమెతో మాట్లాడాను. నన్ను ఆ అమ్మ చూచినంత ప్రేమానురాగాలతో నా ముగ్గురు తల్లులలో ఎవరు చూడగలరు? నేనంటే ప్రాణాలనైనా ఇస్తుందే ! సరే ఇక చెప్పవద్దు. మీ అందరి విచారానికి కారణమని భావించే యీ సంఘటనకు ఆ తల్లి కారణమెట్లా అవుతుంది?
లక్ష్మణా ! ధనుర్విద్యలో నీ కంటె ఒకటి రెండు మెలుకువలు, ఆధిక్యం నాకున్నాయంటే, అవన్నీ ఆ తల్లి చేతి చలువ వల్లనే కదా ! నువ్వు చూపిస్తున్న ప్రతాపం, కోపం, నేనంటే నీకున్న ప్రేమ, ఆరాధన, ఇవన్నీ ఆమెకు తెలియకుండానే ఉన్నాయా ? మరి తెలిసి తెలిసి, యింతటి విజ్ఞానవంతురాలు యీ పని యెందుకు చేసిందో?
అసలు యీ పని ఎవరో చేసింది కాదు. మరి ఎవరు చేశారంటావు? దైవం చేసింది. విధి ఎంత బలీయమైనదో, మహాఋషులు కూడా విధికి లొంగిపోయారంటే ఇక చూడు.
లోకంలో, ఊహకు అందని దానిని దైవ మంటాము. నన్ను గురించి ఇంత ఆందోళన, అమాయకురాలు నా పినతల్లిని గురించి యింత అనుమానం నీ కెందుకు? ఇదంతా దైవశక్తి యొక్క కూర్పు. తనకు తానుగా దైవం చేసే యీ చక్కని కూర్పును ఆపడానికి నీకైనా, నాకైనా సాధ్యమా చెప్పు !
లోకంలో, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, భయక్రోధాలు, కలిమిలేములు, క్రూరమైన దైవకర్మలు, అనుకోకుండా జరిగే దుర్ఘటనలు, ఊహాతీతమైన పనులు, ఉగ్రకార్యాలు అన్నీ దైవికాలే. "
అవతారమూర్తి అయిన రామునికి జగత్తు యొక్క రహస్యం తెలుసు. రాముడు దానిని విడమరిచి చెప్పి, లక్ష్మణుడిని శాంతతపరుస్తున్నాడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.