పొలతికి వెంటఁ గానబడిఁ బోవుట కావలె, మీరు లేక యా
లలితవిలాసవాంఛలు వెలందులు పాదరసంబు కన్నఁ జం
చలలు తలంపులన్ నిలుపజాలుదురే స్థితధర్మవీధులన్.
తవిలి నృపాల కన్యకల దారియుఁ జిత్రము, వారికేమి త
క్కువ, పదియూళ్ళులిత్తురనుకొమ్ము పితల్, తనుయాత్రదాటి పె
క్కువయుగ లౌకికంబు సుఖకోటి భజింపను వచ్చు భర్తయన్
నవవనబుద్ధి నిల్చిన సనాతన భావశిఖల్ జ్వలించుటల్.
సీతారామలక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వచ్చి మహర్షికి ప్రణామాలర్పించారు. మహర్షి కూడా వారికి అతిథి మర్యాదలు చేశాడు. ఎంతోకాలంగా తన వద్ద దాచి ఉంచిన ధనుస్సును, ఖడ్గాన్ని రామునికి ఇచ్చి, వాటిని లోకకళ్యాణార్థం, దానవ సంహారానికై ఉపయోగించమన్నాడు. తరువాత సీతారాముల నిద్దరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.
" ఈ రోజుల్లో తండ్రి మాట నిలబెట్టడం ఎవరికి కావాలి? భర్త కోసమని అడవులబడి రావటం ఎవరికి కావాలి? విలాసాల కోరికల్లో తేలియాడుతూ , పాదరసం కన్నా ఎక్కువగా జారిపోయే స్వభావం కల స్త్రీలు, వారి మనసుల్లో స్థిరమైన ధర్మ మార్గాన్ని నిలుపగలుగుతారా?
అందులోను రాజకుమార్తెల దారి చిత్రమైనది. వారికేం తక్కువని? వారి తండ్రులు పదూళ్ళు ఇచ్చారనుకో. దానితో జీవితకాలమంతా హాయిగా జరిగిపోవటమే గాక, లౌకికంగా కోటిసౌఖ్యా లనుభవించవచ్చు. భర్త అనే పేరు మీద, క్రొత్తగా వనవాస బుద్ధి కలిగిన వాడితో నడవటమంటే, పాత భావాలతో మ్రగ్గిపోవటమే. "
అగస్త్యుడు లౌకిక సుఖాలను కోరుకొనే అధికసంఖ్యాకులైన స్త్రీలకు, భర్తను అనుసరించి పాతివ్రత్య ధర్మానికి పరమ ప్రామాణ్యాన్ని సంపాదించి పెట్టిన సీతాదేవి వంటి స్త్రీకి గల వ్యత్యాసాన్ని చక్కగా తెలియజేసాడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment