వానలోనఁ జనుచు వల్లభ ! గొడుగును
వదలిపోవునట్టి వానిరీతి
నడవియందుఁ బోవ నక్కటా ! వాంఛింతు
తల్లి పిదపఁ దల్లిఁ దరుణి వదలి.
ఓ ప్రభు యెందుఁగాని వినియుంటిమె క్రూరములైన సత్వముల్
దీప్రము లౌట, మౌనిజన దివ్యమహఃపరిపూతభావనా
వప్రములైన యే ఋషులపల్లెలనేన్, ఋషికల్పుడైన నీ
శ్రీపదమైన తేజమె హరించు ననర్థచయంబు లన్నిటిన్.
నాకున్ మిక్కిలి కోర్కి యున్నదియుఁ గాంతారంబు దర్శింప, నా
నేకంబుల్ మృగపక్షి వృక్షభుజగానేకంబులున్ దత్స్వభా
వాకారంబులు చూడగానగున యాయందంబు గంభీరిమ
ప్రాకామ్యంబులు చూచి చిత్తమున నే భావంబు దీపించునో !
రామునితో పాటు వనములకు పోవటానికి సీత భర్త యొక్క అనుమతి కోరింది. అరణ్యంలో క్రూరమైన జంతువులు, మహావిషపూరితమైన పాములు, కంటకావృతమైన నడిచేదారులు, రాక్షసబాధలు ఉంటాయని రాముడు సీతను వారించటానికి ప్రయత్నించాడు. అప్పుడు రామునితో సీత ఇలా అన్నది.
" నాథా ! వానలో వెళుతూ గొడుగును వదలిపెట్టి పోయిన వాడిలాగా, అడవికి వెళుతూ, తల్లి తరువాత తల్లి వంటి భార్యను వదలి వెళ్తానంటావేంటి?
ఓ ప్రభూ. ! మునుల యొక్క పవిత్ర భావనలచేత పరిరక్షింపబడుతున్న ఏ మునిపల్లెల్లోనైనా, అక్కడ సంచరించే క్రూరజంతువులు క్రూరంగా ఉంటాయని వినియున్నామా? ఋషికల్పుడవైనటువంటి నీ దివ్యపాదముల శుభకరమైన తేజస్సు యెటువంటి ఆపదలనైనా పోగొడుతుంది.
నాకు అరణ్యాలను చూడాలని చాలా కోరికగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేకమైన మృగ, పక్షి, వృక్ష సంతానాన్ని, వాటి స్వభావాలని, ఆకారాలను చూడాలని ఉంది. వాటి యొక్క అందం, గాంభీర్యం, భగవంతుడు వాటియందుంచిన విభూతి విశేషాలు చూస్తే మనసులో ఏ భావం ఉదయిస్తుందో కదా ! "
సీతకు వనవాసం మీద కలిగిన మక్కువ రామాయణ కథాగమనానికి పెద్ద మలుపు. సీతకు అరణ్యవాసంపై గల యీ మక్కువే తదనంతర ఉత్తరరామాయణ కథకు నాంది పలికింది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్థాన ఖండము లోనివి.
No comments:
Post a Comment