స్పందిత జీవలక్షణమె వచ్చి శరీరము తాల్చి పొల్చెడున్
గొందఱ వాఱి జూచుటయె గుర్తును పట్టుట వారి సద్గుణా
ళిం దనివొందు భావ విమలీకృత చిత్తముతోడఁ బోల్చినన్.
గుణవిభావనాత్తాకృతి క్షోణిజాత
మనసులోన నవ్యక్తమై మలయుచుండె
నట్టి యవ్యక్తరూపంబు వ్యక్తరూప
ముగను జేయగఁ బటురూక్షముగఁ దలంచి
కనులుమూసి యెడమకంటి ముందర రామ
భద్రు నిలిపి యతని ప్రక్క దేవి
రూప మెంచుచుండ రూక్ష రూక్షంబుగ
నొక మెఱపు మెఱసె నూర్జితముగ.
తామరపూవుపై సిత సితచ్ఛవు లూరుచు నున్నయట్లు సౌ
దామని నిల్చియున్నటుల దామరసేక్షణ కోమలార్ద్రభా
వామృత మందహాసరుచిరానన చేతను తెల్ల తెల్లనౌ
తామరపూవు విచ్చినది తాలిచి తేనియ పచ్చిరేకులన్.
అంతలోన దేవి యంతర్హితంబైన
నిలిచి రామమూర్తి నీరజాక్షుఁ
డంత హనుమ యెఱిగె నాత్మలోపలి తన
రామమూర్తికాడు రామమూర్తి.
ఇదివఱకే యెఱింగినదె యీ మహనీయతరార్థ మైహికా
స్పదమగు కార్యమందున బొసంగదు దైవికమైన యత్న మీ
పదమున నద్దిగాక తన భావము మానసికంబు కాక మో
క్షదము నుపాసనా విషయి గావున భేదముకల్గె మూర్తిలో.
హనుమ లంకానగరంలో సీతాన్వేషణ సాగిస్తున్నాడు. అమ్మను గుర్తుపట్టాడమెలాగా, ఇంతకు ముందెన్నడూ చూడని ఆ తల్లి రూపురేఖ లెలా ఉంటాయా అని ఊహిస్తున్నాడు. తన మనస్సులో పలు విధాలుగా తలపోస్తున్నాడు.
" లోకంలో కొందరు భౌతికజీవులుంటారు. వారు అన్నమయశరీరులు. కొందరు మనోమయజీవులు. వారు ఎల్లప్పుడూ వారి భావాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. ఆ జీవలక్షణమే రూపు దాల్చి వచ్చిందా అన్నట్లు కనపడతారు. కొందరిని చూడటమంటేనే వారిని గుర్తుపట్టడం. ఎక్కడో చూసినట్లనిపిస్తుంది. వారి గుణగణాలను అంచనా వేసుకోగలుగుతాము. వారి సద్గుణాలు మనను ఆకట్టుకొంటాయి కనుక వారి భావాలు కూడా విమలంగా, మనోజ్ఞంగా ఉంటాయి.
అటువంటి సద్గుణరాశి సీత. అందువల్ల నా మనస్సులో తెలియకుండానే ఆమె రూపం మెదులుతూ ఉంది. అటువంటి అవ్యక్త రూపాన్ని వ్యక్త పరచుకోవాలంటే గాఢమైన భావన చేయాలి.
ఈ విధంగా తలపోసి, హనుమ కనులు మూసుకొని, ఎడమకంటి ముందర రామచంద్రమూర్తిని నిలిపి, ఆ ప్రక్కనే అమ్మవారి రూపాన్ని తలచుకొంటుండగా, అద్భుతంగా ఒక్క మెరుపు మెరిసినట్లుగా అయింది.
తామరపూవు మీద తెలతెల్లగా కాంతి బహిర్గతమౌతున్నట్లుగా, పద్మాల వంటి విశాలమైన నేత్రాలతో, మంజులమైన భావామృతాన్ని చిలికిస్తూ, మందహాస ముఖారవిదంతో , చేతిలో, తేనెలను కుమ్మరిస్తున్న పచ్చిరేకుల తెల్ల తామరపువ్వును పట్టుకొనిన ఒక దేవతామూర్తి తన కనుల యెదుట నిల్చొని ఉన్నట్లుగా హనుమకు కనిపించింది.
అంతలోనే ఆ దేవి అంతర్థానమై, ఎదురుగా నీరజాక్షుడు రామచంద్రమూర్తి నిల్చొని ఉన్నాడు. కానీ, ఈ నిల్చున్న రామమూర్తి, తన ఆత్మలో నిలిపుకొన్న రామమూర్తి కాడని అనిపించింది.
తన ఆత్మ లోపల తానెరిగిన రామమూర్తి ఐహికపైన పనులలో పొసగే రూపం కాదు. సీతాన్వేషణ అనేది దైవికమైన పని. సాధించవలసిన కార్యం మానసికం కాకుండా మోక్షప్రాప్తి కలిగించేది, ఉపాసనాపరమైనది కాబట్టి,రాముడు నాకు కనిపించిన తీరులో భేదం ఉంది. "
సీతాన్వేషణ గవేషణ. అనగా, దేనినైతే యదార్థంగా వెదకవలెనో, దానిని వెదకుట గవేషణ. అన్వేషణ చేయవలసినది పరమేశ్వరీ సాక్షాత్కారము కొరకు, మోక్షప్రాప్తి కొరకు. దానికొరకు, గాఢమైన భావన, ఉపాసన అత్యంతావశ్యకము. హనుమ రామోపాసకుడు. అనగా, పరమేశ్వరీ ఉపాసకుడు. సీతారాములకు తత్త్వములో భేదము లేదు. ఇది హనుమకు తెలియును.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment