సొరిదిం జెప్పెను తార పోవలదటంచున్ నీ మహాధర్మ సుం
దర శీలంబునయందుఁ బొల్చిన మహాధైర్యంబుతో వచ్చితిన్
బరమోదాత్తుడవిట్లు చేసితివి నీ పాపంబు నీ చేత సా
కిరియై వానరరాజ్య లోభమతియై సుగ్రీవుండు చేయింపగా
అయ్యో ! రాఘవ యేమి చేసితివయా ! యాచంద్రతారంబుగా
నొయ్యన్ నీదెస మచ్చచెప్పుపని యేడో వాడు దుర్మార్గుడై
ముయ్యేఱై చను నీ యుదాత్తచరితమున్ ఖండదేశంబునన్
జియ్యంబట్టు మతిన్ విసంబు కలిపించెన్ భాగలుద్ధాత్ముడై
ఇదిగో వీనికి రాజ్య మిమ్మనిన నేనిత్తున్ గదా నన్ను నే
పొదలన్ గుట్టలఁ గానలన్ వెలుగులన్ బొమ్మన్నఁ బోదుం గదా
అదియుం జూడుమ యాతఁ డైనదియు నీకా నేను గాకున్న య
ట్టిది యేమున్నది భూసుతన్ వెదకుపొంటెన్ నీకు కార్యంబుగా
అలఘుభుజాబల సా
రోజ్వలుడై విదలించి సప్తసాగరముల లో
పల ముంచి యెత్తఁగల్గుదుఁ
బలితమహాకేళిఁ బంక్తికంధరు నేనై.
శ్రీరాముని బాణానికి నేలగూలిన వాలి రాముడిని నిలదీసి, యీ అధర్మ వార్తన మేమిటని ప్రశ్నించాడు.
" తొందరపడి యుద్ధానికి పోవద్దని నా భార్య యెంతో చెప్పింది. కానీ నీ ధర్మయుతమైన శీలసంపద మీద నమ్మకంతో, గొప్ప ధైర్యంతో వచ్చాను. అంత ఉదాత్తచరిత్ర కలవాడి వింత పాపం చేసావు. కాదు, కాదు, నిన్నడ్డం పెట్టుకొని వానరాజ్యం కాజేయాలన్న లోభంతో సుగ్రీవుడు నీ చేత యీ పాపం చేయించాడు.
అయ్యో ! రాఘవా ! ఏం పని చేశావయ్యా ! ఆచంద్రతారార్కం నీకు మచ్చ తీసుకొనివచ్చే పని ఎవడో వాడు నీ చేత చేయించాడు కదా ! ముల్లోకాల్లోను పవిత్ర గంగాజలంలాగా ప్రవహించే నీ భవ్యచరిత్రను, భూమిజనులే యీసడించుకొనేటట్లుగా, రాజ్యం కోసమని, దేవుడులాంటి నిన్నడ్డం పెట్టుకొని, నీ మనస్సులో విషాన్ని నింపి, నీ చేత యీ పాపం చేయించాడు.
ఇదిగో, వీడికి రాజ్యమివ్వు అని ఒక్క మాటంటే నేను ఇచ్చేవాడిని కదా ! నన్ను ఏ పొదల్లోనో, గుట్టల్లోనో, అడవుల్లోనో తలదాచుకోమంటే వెళ్ళిపోయేవాడిని కదా ! ఇంకొక సంగతి. అతడు నీకు చుట్టమూన్ను, నేను కానివాడినా? చెప్పు. అయినా నీకు కావలసిన పని ఏముంది కనుక? సీతాదేవిని వెదకటమే గదా !
మహాబాహుబలోజ్వలుడనైన నేను ఆ దశకంఠుణ్ణి ఏడు సముద్రాల్లో ముంచెత్తి ఒక ఆట ఆడుకోగలను. "
ఎవడో వాడు దుర్మార్గుడై రాముని చేత యీ పాపం చేయించాడని, తప్పును సుగ్రీవునిపై నెడుతున్నాడు గానీ, నిజానికి చెడు మార్గంలో పోయింది వాలి. రెండవది, ' నీవు రాజ్య మిమ్మంటే ఇచ్చేవాడిని గదా ! ' అన్నాడు గానీ, తార యెంత బుజ్జగించి చెప్పింది సుగ్రీవుడిని యువరాజును చేసి అన్నదమ్ముల మధ్య వైరానికి స్వస్తి పలుకమని ! బాహుబలగర్వంతో విర్రవీగిన వాలికి అప్పుడు అవి గుర్తుకు రాలేదు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖాండము లోనివి.
No comments:
Post a Comment