యుటయున్ గైకెయి వచ్చి చూచుటయు ' నోహో తండ్రి ! యా బాణ మి
ట్టటు నట్టిట్ల ' ని చిత్రదూరములు లక్ష్యంబుల్ విదారింప, జె
ప్పుట చేయించుటయున్ ముదంపడుటయున్ బొల్చున్ వనీవీధికన్.
తన విల్లేగతిఁ బట్ట నమ్ము నెటు సంధానింప గైకేయిఁ శా
సనమే శాసనమా ప్రభూత్తమునకున్ జక్కంగఁ గైకేయి విం
టిని నీప్రక్కగ నమ్మిటుల్ వదలుకొంటే దాకు నందంచుఁ జె
ప్పును, లక్ష్యంబునుఁ దాకు, రాముడును నవ్వున్, నవ్వుఁ గైకేయియున్.
ఎలమిన్ దానిది వేళపాళయని లేదెల్లప్పుడున్ రామచం
ద్రులు తానున్ తన కార్ముకంబు వడిఁ జేరున్ గైకయీసౌధభూ
ములఁ దత్సౌధసమీపవృక్షనివహంబుల్ లక్ష్యముల్ దూయు లో
పల రా మంథర పోవ మంథర భయభ్రాంతిన్ సివా లాడగన్.
తా హాస్యాద్భుతశీలి రాముడు పృషత్కంబుల్ ప్రయోగించుచో
హాహాకారము లేచు మంథరను రాయన్ బాయగా నేయు ద
ద్దాహాకారము లెంతగా బలియునో హాస్యంబుఁ దా నంతగా
బాహాస్ఫాలనమూర్తి చేయు రఘురాట్బాలుండు గగ్గోలుగాన్.
దాశరథులు పెరిగి పెద్దవారవుతున్నారు. ధనురభ్యాసం చేస్తున్నారు. రామునికైతే కైకమ్మ తోడిదే లోకం. ఆ తల్లికి కూడా అంతే.
" ఆజానుబాహువైన రాముడు ప్రతిరోజు ధనురభ్యాసం చేయటం, కైకమ్మ వచ్చి అది చూసి, " ఓహో ! నాన్నా ! ఆ బాణమిట్లా వెయ్యాలి.....ఆ ఇట్లా .....ఇట్లా ..." అని చాలా దూరంగా చిత్ర విచిత్రమైన రీతుల్లో లక్ష్యాల నేర్పరచటం, దగ్గరుండి చెప్పటం, చేయించటం, లక్ష్యాన్ని ఛేదించగానే సంతోషపడటం,.. ఇదీ కైకమ్మ సౌధాంతర్గత ఉద్యానవవంలో దైనందిన చర్య.
రామునికి కూడా, ధనుస్సును ఎట్లా పట్టుకోవాలో, బాణాన్ని ఎట్లా గురిపెట్టాలో, పినతల్లి చెప్పిన మాటే శాసనం. కైకేయి చెప్పినదంతా చక్కగా విని, రాముడు లక్ష్యాన్ని తాకేటట్లు బాణం వేసి, అది లక్ష్యాన్ని తాకగానే, రాముడు కిలకిలా నవ్వుతాడు. అది చూసి కైకమ్మ కూడా నవ్వుతుంది.
వాళ్ళిద్దరికీ వేళాపాళ అని లేదు. రాము డెప్పుడూ ధనుస్సును బుజానికి తగిలించుకొని, బాణాలను పట్టుకొని కైకేయి సొధానికి చేరేవాడు. ఆ సౌధప్రాంతం లోని చెట్లను లక్ష్యాలుగా చేసుకొని బాణాలను ఎక్కుపెట్టేవాడు. అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరుగుతున్న మంథర భయంతో సివమెత్తినట్లుగా అరిచేది.
రాముడు పరిహాసశీలి. మంథరను చూడగానే అద్భుతమైన హాస్యాన్ని పండించేవాడు. రాముడు బాణం వేయగానే మంథర హాహాకారాలు చేసేది. అది చూసి, మంథరను రాచుకొంటూ వెళ్ళేటట్లుగా రాముడు బాణాలు వేసేవాడు. మంథర అరుస్తూ పరుగెత్తుకొంటూ వెళ్ళేది. మంథర ఎంత పెద్దగా హాహాకారాలు చేసేదో, రాముడంత విరివిగా బాణాలు వేసేవాడు. దానితో మంథర పెడబొబ్బలు పెట్టేది. "
ఈ పద్యాలలో పినతల్లి కైకేయికి రామునికి మధ్య పెనవేసుకొన్న గాఢానుబంధం ఒకప్రక్క, మంథర రామునిపై మాత్సర్యం వహించటానికి హేతువును ఒక ప్రక్క, రాముని యొక్క ధనురభ్యాసం కాలంలో విశ్వనాథ చక్కగా చూపించారు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము లోనివి.
No comments:
Post a Comment