పతి ప్రవాసగతుండైనఁ బడతి యొక్క
నీతిఁ బుట్టింటియందైన నిలువవచ్చు
నాడుబిడ్డల మఱదుల యత్తలందు
రామ ! ప్రోషితపతికి గౌరవం లేదు.
ఆదికాల ధర్మ మంగనకును భర్త
సకల దైవతములసంపుటమ్ము
పడతి పరుల వెన్నుబడి నగ్గిజొరదు వి
శుద్ధి భర్తనుబడిఁ జొచ్చినట్లు.
తన వేదంబులు పండియున్న మతిచేతన్ దల్లి సావిత్రి భ
ర్తను వెన్నాడి పరేతరాజును ఋగర్థస్తోమసంప్రీతుఁ జే
సెను యా పాలిత భర్తృసంవ్రతము నా చిత్తంబునన్, హత్తియుం
డెను శ్రీ రాఘవ ! నే వనంబులకునేన్ నీ వెంటనే వచ్చెదన్.
వనవాసగతుడౌతున్న భర్త రాముడిని ఉద్దేశించి సీత యిలా అన్నది.
" భర్త దేశాంతరం వెళ్తే, భార్య పుట్టింటికి వెళ్ళి కాలం గడపటం లోకనీతి, ధర్మం కూడాను. భర్త దేశాంతరగతుడైనపుడు, ఒంటరిగా ఉన్న ఆడది ఆడబిడ్డల దగ్గర, మరదుల దగ్గర, అత్త దగ్గర ఉండటం మర్యాద కాదు.
అనాది నుంచి, భార్యకు భర్త సకల దేవతాస్వరూపం. భర్త విగతజీవుడైతే భార్య అతడితో పాటు సహగమనం చేస్తుంది గాని, ఇతరులతో అగ్నిప్రవేశం చేయదు.
తనకున్న వేదపరిజ్ఞానంచేత, పూర్వం సావిత్రి యమధర్మరాజును ఋగర్థాలు స్ఫురించే స్తోత్రాలతో సంతుష్టుడిని చేసింది. శ్రీ రామచంద్రా ! ఆమె పాలించిన పాతివ్రత్య ధర్మం నా హృదయంలో నాటుకొని ఉంది. అందుచేత, నేను నీతో పాటే అరణ్యాలకు వస్తాను. "
సీత సనాతన భారతీయ పాతివ్రత్య ధర్మానికి పరమప్రామాణ్యమైన సావిత్రిని ఆదర్శంగా గ్రహించిన వనితాశిరోమణి. ఆమే సాక్షాన్మహేశ్వరి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్థాన ఖండము లోనివి.
No comments:
Post a Comment