ఇంత కోపమ్ము వచ్చినదింత కోప
మనుచు రాలేదనుచు లేద యసురపతికి
వీనిఁజంపనె వలయు దర్వీకరాభుఁ
గాటుపై గాటు వేసెడుగాదె యనుచు.
అపుడు స్వయంభుదత్తము మహాశనికల్పము సర్వదేవతా
రిపువు హుతాశనాంశునిబిరీసము ధూర్జరమైనదిన్ మహా
స్త్రపుఁ బదనైనశక్తిని భరంబగుదాని నిగిడ్చె రాము త
మ్ముపయిఁ బ్రవేగవంతము నమోఘము పూర్వమహాహవంబులన్.
పత్రిగతిన్ శరత్రితయవారితమయ్యు నదృశ్య మౌచు సౌ
మిత్రిని దాకె శక్తి విషమించిన చేతనశక్తిగా మహా
పత్రప నంది చేతనము వాసి ధరం బడె నంతలోన సౌ
మిత్రియు వైష్ణవంబు తన మిక్కిలి తేజము సంస్మరించుచున్.
లక్ష్మణుడు రావణుని ధనుస్సుల నొకదాని తరువాత నొకటి ముక్కలు ముక్కలు చేశాడు. అపరాథం చేసినవాడిని నిలబెట్టి శిక్షించినట్లుగా, చేతిలో విల్లు లేనటువంటి రావణుడిని లక్ష్మణుడు బాణాలతో యెడాపెడా కొట్టాడు.
" దానితో రావణుడికి చెప్పలేనంత కోపమొచ్చింది. " పాము కాటుపై కాటు వేసినట్లుగా, ఒళ్ళంతా తూట్లు పొడుస్తున్నాడు. ఇతడిని చంపకుండా వదలకూడదు" అని అనుకొన్నాడు రావణుడు.
అపుడు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి, పిడుగుపాటు వంటిదానిని (వజ్రాయుథమంత శక్తివంతమైన దానిని), సర్వదేవతలకు శత్రువైనదానిని, అగ్నిజ్వాలల వలె దట్టంగా అలుముకొనే దానిని, మహాస్త్రముల యొక్క శక్తిని మించినదానిని, మహావేగవంతమైన దానిని, అమోఘమైన అస్త్రాన్ని (బ్రహ్మాస్త్రాన్ని) రాముడి తమ్ముని మీద ప్రయోగించాడు.
లక్ష్మణుడు మూడు బాణాలతో ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించాలని చూసాడు. అది ఆకు గాలిలో తేలుతున్నట్లుగా అదృశ్యమై, మరల వచ్చి లక్ష్మణుడిని తాకింది. లజ్జాభరితుడైన లక్ష్మణుడు చైతన్యం తగ్గిపోయి, తనదైన వైష్ణవతేజాన్ని తలచుకొంటూ నేలపై పడిపోయాడు. "
చెప్పలేనంత కోపమొచ్చిం దనటానికి, ' అంతాఇంతా కోపమని కాదు ' , ' ఇంత కోపమొచ్చింది, అంత లేదని గాదు ' మొదలగునవి అచ్చంగా తెలుగువారు వాడే పలుకుబడులు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment