మనసు ద్విధాకృతంబయిన మాదిరి తోన గ్రహించి లోపలం
దనియదు చిత్తమున్ నయనతామరసంబుల నంటి యున్న దౌ
మన సొకడే సుఖంపడిన మాదిరి స్పష్టముగాగ నంజనా
తనయుడు నిట్టు లౌటకు నిదాన మదేమని చిత్తగించుచున్.
మఱియు విశాలమైనది విమానము నాల్గుప్రదేశముల్ పొరిం
బొరిఁగని యంతటన్ నిదురపోయెడు కాంతల తృప్తి లక్షణం
బరయుచు దాదృశంబయినయట్టిది తృప్తియు నీమెదౌ ముఖాం
బురుహములందు నంగముల పొందికలోపలనట్లె కాంచుచున్.
మానవరాజు లార్యులు క్షమాప్రథముల్ మనుసర్వధర్మ వి
జ్ఞానులు చాన యన్యజన సంగతి పొందుట వారి యిండ్లలో
లేనిది భర్త పోయినను లేమ సహోదరుఁ బొందఁబోవ దం
దైన సుమానుషంబున కుదాహరణంబులు వారిపొందులున్.
హనుమంతుడు పుష్పకంలో శయ్యపై నిద్రిస్త్రున ఒక అందమైన స్త్రీని చూసి, ఆమె సీతామహాదేవి కావచ్చునేమోనని అనుకొన్నాడు. కానీ యెందుకో లోపల మాత్రం అంత తృప్తిగా లేదు.
" మనస్సు రెండు రకాలుగా ఆలోచిస్తున్నదని గ్రహించిన వెంటనే, బయట కంటితో సంబంధమున్న మనసొక్కటే సౌఖ్యానుభూతి పొందుతున్నదని, లోపలి మనస్సు మాత్రం తృప్తి చెందటం లేదని హనుమకు స్పష్టమయింది. ఈ విధంగా అవటానికి మూల మేమిటా అని ఆలోచింపసాగాడు.
పుష్పక విమానం చాలా విశాలమైనది. పుష్పకం నాలుగు వైపులా చాలా జాగ్రత్తగా చూసాడు. దానిలో నిద్రపోయే స్త్రీల ముఖాల్లో తృప్తి లక్షణాన్ని పరీక్షించాడు. సీతాదేవి అని తాను భ్రమపడిన స్త్రీ ముఖంలో, అవయవాల పొందికలో కూడా అటువంటి తృప్తి లక్షణమే ఉన్నదని గ్రహించాడు.
మానవరాజులు పూజ్యులు. క్షమాగుణం కలిగినవారు. మానవజీవితాన్ని నడిపించే మనుధర్మశాస్రాన్ని బాగా అర్థం చేసుకొన్న విజ్ఞానఖనులు. వారి స్త్రీలు అన్యజనములతో కలిసి ఉండటం అనేది ఎరుగనివారు. భర్తను కోల్పోయినా కూడా సహోదరుని వద్దకు పోనటువంటి సౌశీల్యవతులు, అభిమానవతులు వారు. ఉత్తమ మానవధర్మానికి వారి నడతలు మంచి ఉదాహరణలు. "
హనుమంతుడు మొదట కొంచెం భ్రమ పడినా, తరువాత వివేకంతో సూక్ష్మపరిశీలన చేయగలిగాడు.. సత్పురుషులు ఒకవేళ పొరబడినా, మరల వెనక్కి తిరిగి చూసుకొని, విషయాన్ని పరిశీలించి, అన్ని కోణాల్లోను కూలకషంగా అధ్యయనం చేస్తారు. బుద్ధిమదగ్రగణ్యుడైన ఆంజనేయుడు చేసింది అదే.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర ఖండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment