ఈ జులపాలజుత్తుగల యీ పసిబాలుని నే నెఱుంగుదున్
రాజ ! యొసంగగా వలయు రాముని నాకయి దైత్యలోక ప్రా
ణాజిరబద్ధపీఠుఁ డయినట్టి యముం డితడా దితిప్రసూ
తాజిన మంత తా నొలుచు నద్భుత శౌర్య నిధాన మీతడున్.
దైత్య తనూవిదారణ విధానపటిష్ఠుడు రామమూర్తి దౌ
ర్గత్యము గల్గె దైత్యులకు గాలము చేరువ యయ్యె వారికిన్
సత్యపరాక్రముండు రఘుశాబకుఁడేను నెఱుంగుదున్ దప
స్స్థిత్యమృతాత్మదీధితి వశిష్ఠుఁడెఱుంగును దక్కు మౌనులున్.
క్షీరాస్యుండగు తండ్రికిన్ బహువిధ శ్రేయంబుఁగూర్తున్ ద్రిలో
కీరారాజదుదారకీర్తివిభవ క్రీడానిధిం జేయుదున్
మూరింబో మమకారమేమి ఫలమో? భూపాల ! దైత్యాసు బా
ధారీఢోగ్రభుజాద్భుతున్ గొడుకు నంతఃపత్తనిన్ నిల్పినన్
రాముడిని విశ్వామిత్రునితో అరణ్యానికి పంపటానికి తటపటాయిస్తున్న దశరథునితో ముని ఇలా అంటున్నాడు.
" మహారాజా ! ఈ ఉంగరాల జుట్టు పిల్లవాడి సంగతి నాకు తెలుసయ్యా ! ఇతడిని నాతో పంపించక తప్పదు. ఇత డెవరనుకుంటున్నావు? యుద్ధభూమిలో రాక్షసుల ప్రాణాలను తీయటానికి బద్ధకంకణం కట్టుకొన్న యముడితడు. ఆ దితిసంతానం మొత్తాన్ని మట్టుపెట్టగల శౌర్యనిధి.
రాక్షస సంహార విధానంలో పటిష్ఠుడైన రామమూర్తి చేతిలో చచ్చే దుర్గతి పట్టింది వారికి. వారికి పొయ్యేకాలం దగ్గరకొచ్చింది. సత్యపరాక్రముడైన రాముడి సంగతి నాకు తెలుసు. అఖండ తపస్సుతో అమృతాత్మ అయినటువంటి వశిష్ఠ మహర్షికి తెలుసు. తక్కినవారి కెవరికీ రాముని శక్తిసామర్థ్యాలు తెలియవు.
పాలుగారుతున్న యీ చిట్టితండ్రికి సర్వశుభాలు కలుగజేస్తాను. ముల్లోకాల్లో రారాజు లాగా కీర్తివైభవాలను అందుకొని తులతూగే వాడిగా చేస్తాను. ఊరకే నశించిపోయే మమకారం పెంచుకోవటం వల్ల ఏం ప్రయోజనం? దుష్టరాక్షస సంహారం చేయగల బాహుబలపరాక్రముడైన కొడుకును అంతఃపురంలో ఉంచుకుంటే ఏమన్నా లాభమా? "
అంతకు ముందు " అమరగ నదిగాకయుఁ గోపము వచ్చుట లేదు తొంటివలె నాకు నృపా ! " అని కూడ అన్నాడు విశ్వామిత్రుడు. నిజంగానే, విశ్వామిత్రుడెంతో మారిపోయాడు. వశిష్ఠునితో తొల్లిటి స్పర్థ లేదు. ప్రతిదానికీ వశిష్ఠుడినే పరమప్రమాణంగా పెట్టుకొంటున్నాడు. అంతేకాదు. రామునిపై గల ప్రేమ అతడి ప్రతి మాటలోను ధ్వనిస్తున్నది. దానిని, " ఈ జులపాలజుత్తుగల యీ పసిబాలుని, రఘుశాబకుడు (పసికూన), క్షీరాస్యుడు (పాలుగారే ముఖం కలవాడు) ఇత్యాది మాటలలో ఛందోబద్ధం చేయటం వల్ల కవిసమ్రాట్టుల నిండు మనస్సుకు విశ్వామిత్రుని " నవ్య నవనీత సమానమైన మనస్సు " యెంత సన్నిహితమో ద్యోతకమౌతుంది. పేరులోనే పెన్నిధి ఉన్నట్లు, విశ్వామిత్ర మహర్షి నిజంగా విశ్వానికి మిత్రుడు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అహల్యా ఖండము లోనివి.
No comments:
Post a Comment