తొలినాళ్ళన్ఁ గొడుకున్ స్నుషన్ బ్రియమునం దోకొంచురాగా సుమం
త్రుల బంపించిఁ స్వభర్మహర్మ్యముల నెంతో ప్రేమతోఁ గొడ్కుకో
డలు క్రీడింపగఁ జేయుఁ బంక్తిరథుజాడన్ నేడగస్త్యాశ్రమ
స్థలి సీతారఘురామచంద్రులకుఁ దోచన్ఁ జిత్రమై యెంచుచున్.
నాకు నిజముగా నెపుడు స్వప్నములు రావు
రాత్రి యొక్కటే స్వప్నముల్ రామచంద్ర
కడుఁ బసిడి మేను పొడలు మాఘవతమణులు
కనులు పచ్చలు మిన్నేగఁ గలుగు లేళ్ళు.
అనినన్ శ్రీ రఘుమూర్తి యిట్లనియెఁ గాంతా! నాకు నట్లే యగ
స్త్యుని యా పెంపుడుదుప్పి పెంటి విరహస్యూతాక్షికోణాగ్ని యెం
దున నేనుందునొ యల్ల దా మగిడి యందున్ వచ్చి తోచున్ సుధా
నన ! యేమున్నది భావలగ్నములు స్వప్నంబుల్ విడంబించెడున్.
సీత యొక్క పతిభావాన్ని గురించి ప్రశంసావాక్యాలు పలికిన అగస్త్య మహర్షి, సీతారాములను ఆశ్రమప్రాంతంలో రాత్రి సుఖంగా గడపమని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
" పెళ్ళయిన క్రొత్తల్లో, సుమంత్రుడిని పంపించి, కోడుకును కోడలిని ఎంతో ప్రేమతో తన భవ్యమైన మందిరానికి రప్పించి, వారు సుఖానందడోలికల్లో ఊగులాడేటట్లు చేశాడు దశరథుడు. నేడు అగస్త్యాశ్రమ ప్రాంతంలో కూడా సీతారాములకు అదే భావం కలగటం చాలా చిత్రమనిపించింది. "
తెల్లవారిన తరువాత, సీత రాముడితో యిలా అన్నది.
" రామచంద్రా! నేను నిజం చెపుతున్నాను. నాకెప్పుడూ కలలనేవి రావు. కానీ, అదేమిటో రాత్రి ఒకటే కలలనుకో. ఒళ్ళంతా బంగారం రంగుతో, ఒంటిపైన ఇంద్రనీలమణులు పొదిగినట్లు పొడలు పొడలుగా, కళ్ళేమో పచ్చలు లాగా మెరుస్తూ, ఆకాశంవైపుకి దూకుతున్న లేళ్ళు కలలో కనపడ్డాయి.
ఈ మాట వినగానే రాముడు, " సీతా ! నాక్కూడా అలాంటిదే కల వచ్చింది సుమా ! అగస్త్య మహర్షి యొక్క పెంపుడు దుప్పి, తనకు దూరమైన ఆడదుప్పి మీద విరహంతో నిండిన కంటికొసలతో చూస్తూ , నే నెక్కాడుంటానో అక్కడకల్లా వస్తున్నట్లు తోచింది. అమృతముఖీ ! ఇందులో ఏముంది. మనస్సులో స్థిరంగా నిలిచిపోయిన భావాలే కలలుగా రూపుదిద్దుకొంటాయి. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోని యీ పద్యాలు ప్రతీకాత్మకంగా భవిష్యత్తులో జరుగబోయే దానిని సూచిస్తున్నాయి.
No comments:
Post a Comment