వచ్చుట యూషరావనికి వర్షము వచ్చుట; పుట్టుపేదకున్
గ్రొచ్చిన కొండ్రలోన నిధి కొఱ్ఱున దాకుట; లుప్తబీజమై
లొచ్చునబడ్డ వంగడములో నిసువొక్కడు తోచుటో ప్రభూ !
ఈ జగమం దుదాహరణ కేనియు నిన్ను వినా ఘటిల్లునే?
రాజఋషిత్వమున్ వదలి బ్రహ్మఋషిత్వముఁ గొన్న దీప్రమౌ
తేజపుఁ ప్రోవు నీ యనుమతిం బడి యద్భుతముల్ ఘటిల్లెఁ జే
తోజితవేధ ! నా గడపఁ ద్రొక్కినదే పది వేలయా జటీ !
నీవై సేరుట నా గృహంబులు త్రివేణీసంగమస్నాన పు
ణ్యావిర్భావము గల్గె నా యెడల గాయత్రీ మహాదేవి శ్రీ
సావిత్రాకృతి ద్రష్టభేదముగ సాక్షాత్కారమిప్పించె నే
లా వేదమ్ములు నాల్గు నాలుగు మొగాలం బాడిన నట్లయ్యెడిన్.
విశ్వామిత్ర మహర్షి దశరథుని దగ్గరకు వచ్చాడు. దశరథుడు మహర్షిని అర్ఘ్యపాద్యాలతో పూజించి ఇలా అన్నాడు.
" ఓ మహర్షీ ! నీవు అచ్చమైన జాలి గుండె కలిగిన మహనీయుడివి. నీవు ఇక్కడకు రావటం బీడుబడిన భూమిలో వర్షం కురవటం వంటిది. దుక్కి దున్నుతున్న గర్భదరిద్రుడి నాగలి కొఱ్ఱుకు లంకెబిందెలు తగలటం వంటిది. సంతానలేమితో నిర్వంశ మవబోతున్న వాడికి ఒక బిడ్డ కలగటం వంటిది.
ఈ లోకంలో, ఉదాహరణ కోసమైనా సరే, నీ ప్రసక్తి లేకుండా ఏమన్న జరిగిందా? రాజర్షి పదవిని కాదని పట్టుదలతో బ్రహ్మర్షి పదాన్ని పొందిన తేజోనిధివి నీవు. నీ ఆజ్ఞానుసారంగా యీ లోకంలో అద్భుతాలు జరిగాయి. నీవు సృష్టికి ప్రతిసృష్టి చేసినవాడివి. నీవు నా గడప త్రొక్కటమే పదివేలుగా (భాగ్యంగా) భావిస్తాను మహర్షీ !
నీవు నా గృహాన్ని పావనం చేయటమనేది త్రివేణీసంగమంలో స్నానం చేసినంత పుణ్యం కలిగించేది. నా పట్ల గాయత్రీ అమ్మవారు ప్రసన్నురాలై ద్రష్టభేదంతో సావిత్రి రూపంలో దర్శన మిప్పించింది. నీ మూర్తి, నాలుగు వేదాలు నాలుగు ముఖాలతో పాడినట్లుగా ఉంది. "
విశ్వామిత్రుడు శునశ్శేపుడనే బాలుడిని యజ్ఞపశువుగా తప్పించి రక్షించటం, త్రిశంకుని కోసం సృష్టికి ప్రతిసృష్టి చేయటం అచ్చమైన జాలి గుండెతో చేసినవే. విశ్వామిత్రుడు ఏ పని చేసినా అది లోకకళ్యాణం కోసం చేసిందే. విశ్వామిత్రుడు గాయత్రీ మహామంత్రాన్ని లోకానికి ప్రసాదించిన ఋషి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనివి.
No comments:
Post a Comment