సానువున వ్రయ్యలై ధాతు సంగతారు
ణాంబువులతోడి బుగ్గ పెల్లార్చి కొట్టి
నట్లు కనిపించె వాలి మహాపఘనము.
ఎఱ్ఱ వెన్నెల లుమిసెడు హిమనవాంశు
బింబ సంగతైరావణ విమలదంత
మూడి పడినట్లుగా ధాత్రి నొప్పె వాలి
శ్రమ సృగ్జలౌఘ కర్దమతనుండు.
వాలి ధాత్రి ప్రపతితుఁ డుజ్జ్వలుడు తోచెఁ
బడియగా నొక్కచోట నేర్పడిన నీట
నింపుమీఱ నేకాకియౌ నెఱ్ఱ కలువ
యూటిచనిన గంగానది యొడ్డువోలె.
మఘవదత్తము మౌక్తిక మణిసరంబు
వక్షమునయందు దీపింప వాలి యొప్పె
నింద్రచాపంబు చేతఁ బ్రావృషము సాంధ్య
దరనవారుణమగు జలదంబు వోలె.
వాలిసుగ్రీవులు మల్లయుద్ధం చేస్తున్నారు. అంతకంతకూ సుగ్రీవుని బలం క్షీణిస్తుంటే, వర ప్రభావంతో, వాలి బలం హెచ్చుతూ ఉంది. సుగ్రీవుని దైన్యాన్ని గమనించిన రాముడు, చండతరప్రచండమైన బాణాన్ని సూటిగా వాలి వక్షస్థలంలో నాటాడు. నేలకూలిన మహాయోధుడు వాలిని వర్ణించేవే యీ పద్యాలు.
" మేరుపర్వతం మీద పెద్ద పిడుగు పడగా, మేరుపర్వత సానువు ఛిద్రమై, అక్కడ ఉన్న ధాతువులతో, ఎఱ్ఱని నీటితో కలిసిన బుగ్గ ఆవిరులు గ్రక్కుతూ పైకిలేచి పడినట్లుగా, వాలి భూమి మీద పడిపోయాడు.
ఉషఃకాల సూర్యబింబం యొక్క అరుణారుణ కాంతులు ఇంద్రుని గజరాజం ఐరావతం యొక్క తెల్లని దంతకాంతితో మిళితమవగా, ఆ దంతం ఊడిపడిందా అన్నట్లుగా, చెమట, రక్తంతో తడిసి నటువంటి వాలి శరీరం నేలపైన పడిపోయింది.
నేల మీద రక్తసిక్తంగా పడి ఉన్న వాలి, గంగానది ఒడ్డున ఏర్పడిన నీటిపడియలో, అతిశయించిన వన్నెతో, ఒంటరిగా ఉన్నటువంటి ఎఱ్ఱ కలువపూవులాగా కనిపించాడు.
ఇంద్రునిచేత ప్రసాదింపబడి, మౌక్తిక మణులతో కూడి, ధగద్ధగాయమానంగా మెరుస్తున్నటువంటి కంఠహారాన్ని వక్షస్థలంలో ధరించిన వాలి, సాయంసంధ్యలో, ఇంద్రధనుస్సు యొక్క రంగు చేత ఎఱ్ఱబారిన వర్షాకాల మేఘం లాగా కనిపించాడు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండములో, నేలకూలిన వాలిని విశ్వనాథ వర్ణించిన తీరు చూస్తే, ఆ మహాకవికి వాలి పాత్ర చిత్రణపై, అతని బలపరాక్రమాలపై యెంత ఉదాత్తభావమో అర్థమవుతుంది. ఈ ఘట్టంలోని పద్యాలు చదువుతుంటే, పఠితల గుండెలు బరువెక్కక మానవు.
No comments:
Post a Comment