దూరపు భూమి నాత్మయును, ద్రోవయు ధర్మసమూహ గమ్య, మా
తీఱని దేహవాంఛలను ద్రిమ్మరి క్రిందికిలాగు, నీ మన
స్సూరక నిత్యయత్నమున నూర్థ్వపథంబున చేర్పగావలెన్.
ఎలమి మనస్సు త్రిప్పి, యెవడేనియు ధర్మపుఁ ద్రోవ బోవగాఁ
బలుకుదు రాతనిన్ జనులు వాడొక సజ్జనుఁడంచు, ద్రిప్పకే
నిలుచును ధర్మవీధి నొక నిర్గతకల్మషు మానసంబు, లో
కులు మఱి వాని నేమి యనుకొందురు దేవతలన్నఁ జాలదే.
అనవరతంబు ధర్మమునయందుఁ జలింపని మానసంబు కా
ల్గినయది సీత, పోల్కి కదలించి యరుంధతిఁ దేజు ప్రోవుఁ జె
ప్పనువలె, గాన కీపగిది వచ్చుట గొప్పయెగాదు నిన్నుఁ బొం
దిన జనకాత్మజా మనసు నీపతిభావ త్రికాలనిష్ఠమై.
లిప్త కాల భాగ లేశలేశంబున
యందు నామె హృదయ మంటియుండు
ధర్మమార్గమందుఁ దప్ప దొక్కింతయు
నింతకంటెఁ జెప్పనేమివలయు.
అగస్త్య మహాముని సీతను గురించి ప్రశంసా వాక్యాలు పలుకుతున్నారు.
" మనస్సు అనే దానికి క్రింది దిక్కున దేహ ముంటుంది. పై దిక్కున చాలా దూరంగా ఆత్మ అనేది ఉంటుంది. ఈ రెండింటి మధ్య గల మార్గమే గమ్యస్థానాన్ని చేర్చే ధర్మము. అయితే, అంతులేని కోరికలు మనస్సును క్రిందికి లాగుతూ ఉంటాయి. అందుచేత, మనస్సును నియంత్రించి, నిత్యజగరూకుడై, దానిని పై నున్న గమ్యస్థానానికి, అనగా, ఆత్మపదార్థం వైపుకి చేర్చాలి.
ఎవరైనా మనస్సును నియంత్రించి, ఆత్మపదార్థం వైపుకి త్రిప్పి, ధర్మమార్గాన పోతే, లోకం వాడిని సజ్జను డంటుంది. ఆ విధంగా మనస్సును త్రిప్ప నవసరం లేకుండా, ధర్మమార్గంలో మనస్సు స్థిరంగా ఉండే నిష్కల్మషమానసుడిని లోకం ఏమని పిలవాలి? అటువంటివారిని దేవతలంటే చాలదా !
నిరంతరం ధర్మ మార్గంలో నిలిచే మనస్సు కలిగినది సీత. పోలిక తీసుకువచ్చి ఆమెను చెప్పాలంటే, ఆమె అరుంధతి వంటిది. రామచంద్రా! త్రికాలముల యందు నిరంతరం పతిభావంతో నిండియున్న జానకి నీతోపాటు అడవులకు రావటం పెద్ద విషయం కాదు.
లిప్తలుగా విభజింపబడిన కాలభాగంలో, లేశలేశాన ఆమె హృదయం నిండి ఉంటుంది. ధర్మమార్గాన్ని ఆమె కొంచెం కూడా తప్పదు. ఇంతకంటె ఏం చెప్పాలి? "
ఈ విధంగా సీతను గురించి అగస్త్యుడు ప్రశంస కురిపిస్తుంటే, ఆత్మస్తుతి విముఖురాలయిన సీత, అక్కడ ఉన్న హరిణీసమూహాన్ని చూస్తూ ఉండిపోయింది.
ఈ పద్యాలు సనాతన ధర్మానికి పరమ ప్రమాణమైన పాతివ్రత్యాన్ని ఉగ్గడిస్తూ చెప్పినవి. మహర్షి చెప్పిన మాట యదార్థమే అయినా, " ఆత్మస్తుతి విముఖయైన జానకి హరిణీసమూహంబు గాంచుచుండె" అన్న వచనభాగం, మహితాత్మలు పొగడ్తలకు ఎంత దూరంగా ఉంటారో చెప్పకనే చెబుతున్నది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment