ఈ మాత్రంబున కంత కోపపడ నీవేలాగు కాంతారవీ
ధీమార్గంబుల నాదు మాటలకు నాధిం బెందెదో యన్న నో
స్వామీ ! దండధరుండు నిన్నుఁ గొనిపోవన్ రానె రావద్దు సా
మీ ! మాయామతి యేడొ నన్నె కొనిపోనీ, వాడొ ! యింకెవ్వడో !
అనిన శ్రీరామచంద్రుండు
కోపంబేచుఁ దుషారరుఙ్మృదుకలాకోటీరుచేఁ గాలుఁ డే
యాపత్తింగనెనో మృకండుసుతు ప్రాణాకర్షణప్రక్రియన్
నా ప్రాణంబగునట్టి నీదెస నెలంతా ! యాతడౌ నెవ్వడో
నో పద్మానన ! యంతకంటెఁ బదిరెట్లొందున్ మహాపత్తతుల్.
రామునితో పాటు వనవాసానికి వెళ్ళటం కోసమని సీత సావిత్రి ఉదంతం చెప్పి, భర్తృవ్రతాన్ని పాలించటం స్త్రీ యొక్క పరమ ధర్మమని చెప్పింది. రాముడు నవ్వి, " అయితే యమధర్మరాజు అరణ్యంలో నా ప్రాణాలను హరించాలి, అప్పుడు నీవు నన్ను రక్షించాలన్నమాట " అని పరిహాసమాడాడు. దానితో సీత రాముని కళ్ళలోకి తీక్షణంగా చూసింది.
అప్పుడు రాముడు, " అయ్యో ! ఇంత చిన్న మాటకే అంత కోప పడితే, ఇక అరణ్యంలో నా మాటలకు ఇంకెంత మనోవ్యథ చెందుతావో కదా ! " అన్నాడు. బదులుగా సీత, " స్వామీ ! మిమ్మల్ని యమధర్మరాజు తీసుకువెళ్ళటానికి రానే రావద్దు ప్రభూ ! నన్నే ఏ మాయగాడో, ఇంకెవడో తీసుకెళ్ళనీ ! " అన్నది.
అందుకు శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు.
" సీతా ! మార్కండేయుడి ప్రాణాలను హరించాలని వచ్చిన యముడు కోపంతో రగిలిపోయిన ఆ చంద్రశేఖరుని చేతిలో యెంత ఆపదకు గురయ్యాడో, నాకు ప్రాణసమానమైన నీ కోసం, వాడెవడైనా సరే పదిరెట్లుగా ఆపదలు కలుగజేస్తాను. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, ప్రస్థాన ఖండము లోని యీ పద్యాలలో సంభాషణలు సహజ సుందరంగా ఉండి భవిష్యదర్థం గోచరింపజేస్తున్నాయి.
తెనాలి రామకృష్ణుని వలె, విశ్వనాథ సంబోధనలు చాలా రమ్యంగా ఉంటాయనేది సాహితీప్రియులకు తెలిసిన విషయమే. విశ్వనాథ " మా స్వామి " అనే శతకం లోను, శ్రీమద్రామాయణ కల్పవృక్ష ఖండాంత పద్యాల లోను శివుణ్ణి పలు రకాలుగా హృద్యంగా సంబోధించారు. ఈ సన్నివేశంలో చంద్రశేఖరునికి పరంగా " తుషారరుఙ్మృదుకలాకోటీరు " డని సంబోధించారు. అర్థం ఒకటే. చల్లని వెన్నెలలు కురిపించే చంద్రుణ్ణి తలపై ధరించినవాడు " అని. కానీ, క్రొత్త అందాలను దిద్దుకొంది కదా !
No comments:
Post a Comment