ల్చిన దొరవీపుడిప్పలవలెం గనవచ్చు నటంచు నెంచియున్
ఘనవినయాంబురాశియగు కామిని నిద్దురపోవువేళ చీ
రను తొడదాకగా నెఱుగరాదను నూహను ద్రోసిపుచ్చుచున్.
కడుకొని విల్లుపూనుటనుఁ గాయలుకాచిన చేతితోడ రా
ముడు గ్రహియించె నామె కరముం, గరముం గని తల్లిచేయి గు
ర్తిడనగు నందు మైథిలుకులేశ్వరి నిచ్చలు నేత్రబాష్పముల్
తుడుచుకొనంగ గుర్తులవితోచునొ తోచవొయంచు నెంచుచున్.
పెదవుల పొందిక చిఱు న
వ్వుదయింపగఁ బోవునట్టులుండు నటంచున్
మది నెంచి విరహమగు ని
య్యదనున నది కలిమి సంశయాస్పద మంచున్.
హనుమ లంకలో సీతాన్వేషణ చేస్తున్నాడు. కొంతమంది స్త్రీలు పుష్పకంలో నిద్రిస్తుండటం చూసాడు. వారిలో రావణుడు ఎత్తుకువచ్చిన దేవతాంగనలు కూడా ఉన్నారు. వారి మధ్య సీత జాడ కనిపిస్తుందేమోనని నిశితంగా పరిశీలిస్తున్నాడు. తన బుద్ధివిశేషానికి పదును పెడుతున్నాడు.
" జనకమహారాజు కూతురు మోకాళ్ళు మంథర పర్వతాన్ని దాల్చిన ఆదికూర్మం వీపుడిప్పలాగా ఉంటాయని, ఆ జానువులను పరిశీలించాలని అనుకొన్నాడు హనుమ. కానీ, మహావినయసముద్రురాలయిన స్త్రీని, ఆమె నిద్రావస్థలో ఉన్న సమయంలో, ఒకవేళ చీర తొలగి ఉన్నా, తొడల వరకు పరిశీలించటం మర్యాద కాదనే భావంతో ఆ ఊహను ప్రక్కకు తోసివేశాడు.
ఎల్లప్పుడు ధనురభ్యాసం చేత రాముని చేతులు కాయలు గాచి ఉంటాయనీ, ఆ కాయలు కాచిన చేతితో సీతాదేవి చేతి నందుకొన్నాడు కనుక చేతిని చూసి, తల్లి చేతిలో రాముని చేతిముద్రలను గుర్తుపట్టవచ్చుననుకొన్నాడు. కానీ, నిరంతరం రాముడినే తలచుకొంటూ, పెల్లుబికి వచ్చే కన్నీటి ధారలను తుడుచుకొనటం చేత, తల్లి చేతిలో ఆ గుర్తులు కనపడతాయో లేదోననే సంశయంతో, ఆ పనిని కూడా విరమించుకొన్నాడు హనుమ.
సీతమ్మ పెదవులు పొందికగా, చిరునవ్వుదయిస్తున్నట్లుగా ఉంటాయనుకొన్నాడు. కానీ, రాముని మీద విరహంతో, ఆ చిరునవ్వు ఉండటం కూడా అనుమానమేనని ఊరకున్నాడు. "
సుందర కాండము హనుమంతుని వివేచనకు, బుద్ధి సూక్ష్మతకు, నిశిత పరిశీలనకు చక్కని వ్యాఖ్యానం. వస్తు, విషయ పరిశీలనలో, బ్రహ్మజ్ఞాన సముపార్జనలో, " నేతి, నేతి = న ఇతి (ఇది కాదు, ఇది కాదు) " అనేది ఒక ముఖ్యమైన పరీక్షాంశం.
హనుమకు భావనలో సీతాదేవి సాక్షాన్నారాయణిగా తోచింది. నారాయణుని స్త్రీరూపమే నారాయణి. అందువల్లనే, ఆమె జానువులు " మందరాద్రి దాల్చిన దొరవీపుడిప్ప " లనడం. లలితాసహస్రనామాల్లో, అమ్మవారు " మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా " అని వర్ణింపబడింది. మాణిక్యం చాలా గట్టిగా ఉంటుంది. తాబేలు వీపుడిప్ప చాలా గట్టిగా ఉంటుంది. అంతేకాదు, మోకాలుచిప్ప కిరీటం వలె, టోపీ వలె ఉంటుంది.
అమ్మవారి ఈ నామాన్ని స్మరించినంత మాత్రాన మంథర పర్వతమంతటి కష్టాలైనా దూదిపింజల్లాగా ఎగిరిపోతాయని పెద్దలంటారు. ఆ కారణం చేత, హనుమ తలపులో ఆ నామార్థాన్ని స్ఫురింపజేసే భావన ఉండటం, కష్టతరమైన అమ్మవారి సాక్షాత్కారం (సీతాన్వేషణ) ఫలిస్తుందనడానికి సూచనగా గ్రహించవచ్చు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment