సౌమిత్రిం గనె రావణుం డెదుర దీక్షానిశ్చలభ్రూలతా
స్థేమున్ హేమధరాభ తనునిన్ దీవ్యజ్జటాజూట రే
ఖాముక్తాహిఫణాగ్ర నీలమణిసంకాశ ప్రభావంతునిన్
ధీమల్లోకశిరస్థహీరమణి సందీప్తేందునేత్రచ్ఛవిన్.
మారీచుడు చెప్పినదియు
మారీచుని గూర్చి యితడు మాటాడినదిన్
వే రావణు నెద దిరిగెను
తా రాముని రక్ష యింత తార్కాణముగన్.
విరహము చేత రాముడటవీస్థలి చావని సేవ చేసి వా
నరపతియుం బరాక్రమసనాథుడు మారుతి యొక్కయున్ సుహృ
త్త్వరమణ చేసి యింతపగ పట్టెను వీఁ డది యెందుచేతనో
తరుణినిసైతమున్ విడిచి తా వనసీమకు వచ్చుటెందుకో.
రావణుడి ధనుస్సుల నొకదాని తరువాత నొకటిగా తుత్తునియలు చేసిన లక్ష్మణుడిని రావణుడు చూసాడు. రావణుడికి కనిపించిన సౌమిత్రి యెలా ఉన్నాడో కవిసమ్రాట్టులు అత్యద్భుతంగా వర్ణించారు.
" దీక్షలో ఉన్నపుడు నిశ్చలంగా ఉన్నటువంటి కనుబొమలతో శరీర సామర్త్యం కలిగిన వాడిని, మేరుపర్వతం వలె మెరిసిపోయే బంగారు రంగు కల దేహచ్ఛాయ కలవాడిని, మహాసర్పం యొక్క తలపై నున్న నీలమణి కాంతి వంటి కాంతి గలిగి, విడువబడిన జటముడులు కలిగినవాడిని, బుద్ధిమదగ్రగణ్యుల శిరస్సులందలి వజ్రమణులను చక్కగా ప్రకాశింప జేయగలిగెడి చంద్రుని వెలుగు వంటి కాంతి కలిగిన నేత్రములు కలిగినవాడైన లక్ష్మణుడు రావణుడికి కనిపించాడు.
లక్ష్మణుడిని గురించి మారీచుడు చెప్పింది, మారీచుణ్ణి గురించి లక్ష్మణుడు మాట్లాడినది ఒక్కసారిగా రావణుడి మనస్సులో గిర్రున తిరిగి, రామునికి లక్ష్మణుడింత రక్షణకవచంలాగా ఉన్నాడనటానికి వేరే తార్కాణాలేమీ అక్కరలేదనుకొన్నాడు
" సీత మీద విరహంతో ఉన్న రాముడికి అడవిలో చెప్పలేనంత సేవ చేసి, వానరరాజు సుగ్రీవునితో, మహాపరాక్రమవంతుడు హనుమంతునితో స్నేహాన్ని కుదిర్చి, నామీద ఇతడింత పగబట్టడమెందుకో? భార్యను సైతం విడిచిపెట్టి అసలు ఇతడు అరణ్యాలకు రావట మెందుకో? " అని కూడా అనుకొన్నాడు రావణుడు. "
లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. రామోపాసనా దురంధరుడు. రావణుడు చేసిన మహాపాపానికి ఎవరైనా కినుక వహిస్తారు. అటువంటిది రామునికి నిత్యసమీపవర్తి, శేషాంశతో పుట్టినవాడు పగబట్టడంలో ఆశ్చర్యమేముంది? అన్నీ తెలిసినా తెలియనట్లు నటించటం రావణుని కపటస్వభానికి గుర్తు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధానికి కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment