ఓయీ ! శ్రీరాఘురామ ! యీ యడవి నీ యున్కిం బ్రమాణంబులో
భూయిష్టంబుగ జెల్లిపోయె మఱి యే మూడేండ్లో మీ కైక తా
నే యూహన్ నినుఁబంచెనో వానికి నీ కే యూహ లోనుండెనో
యా యూహాఖిల సర్వసిద్ధియగుఁ జో టాలోచనం జేసితిన్.
నీ సత్యవ్రతపాలనా నియమ పాడిత్యంబుచే రాఘవా !
యాసూర్యంబుగ మీకులంబు పరిపూతాకారముం దాల్చెనో
యీ ! సత్యవ్రతబుద్ధి నీ జనకు డూహింపంగరానట్టి వా
చాసత్యత్వము రూపమేర్పడఁ గ్రియాసంధానముం చేయుటన్.
తా వరయుగ్మ మిచ్చుటయె దారణినాథుని యిష్టమట్లు కా
దో వరమీయ నేది యగునో యది యౌనని చెప్పియుండు నీ
తో వనమేగుమంచు ననడో యిది నీ సుగుణంబు చేత నీ
వే వెస జేయగావలయునిద్దఱ ధర్మము లిట్టి సూక్ష్మముల్.
ఆ తండ్రికి నా తండ్రియు
నీ తనయున కీవు నీవు నిద్దఱ ధర్మ
ద్యోతితమూర్తుల యోత
ప్రోతముల క్రియోహ లేకరూపము రామా !
సీతారామలక్ష్మణుల వనవాసం పదేండ్లు పూర్తయింది. అగస్త్యాశ్రమం నుండి బయలుదేరటానికి ముందు, అరణ్యంలో నివాసయోగ్యంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశమేమైనా ఉందా అని రాముడు అగస్త్య మహర్షిని అడిగాడు. అగస్త్యుడు కన్నులు మూసుకొని కొంచెం సేపు ధ్యానంలో ఉండి, ఇలా అన్నాడు.
" ఓయీ ! రఘురామా ! నీవు వనవాసం చేయవలసిన మొత్తం కాలంలో, యెక్కువభాగం అయిపోయిది. ఇక రాబోయే మూడేళ్ళలో, నీ పినతల్లి ఏ ఊహతో నిన్ను అడవులకు పంపిందో, అసలు నీ మనసులో ఏ ఊహ పెట్టుకొని అడవులకు వచ్చావో, ఆ అందరి ఊహలు ఫలసిద్ధి పొందే చోటును గురించి ఆలోచన చేశాను.
రాఘవా ! సత్యవ్రతబుద్ధి కలిగిన నీ తండ్రి కూడా ఊహించనటువంటి సత్యవ్రతపాలన అనే నియమాన్ని నీవు ఆచరించటమే కాకుండా, దానికి ఒక రూపాన్ని కల్పించి, అది ఫలసిద్ధి పొందే మార్గాన్ని ఏర్పరచినందుకు, ప్రత్యక్షదైవం సూర్యభగవానుని సాక్షిగా, మీ రఘువంశం పరమ పవిత్రంగా ఉంటుందోయి !
కైక కోరిన రెండు వరాలను తీర్చటం దశరథ మహారాజుకి ఇష్టమయి ఉండవచ్చు. అట్లా కాకుండా ఉంటే, ఏ వర మివ్వటానికి వీలుపడుతుందో అది మాత్రమే ఇస్తానని కైకతో చెప్పేవాడు. కైకకు వరాలిచ్చిన నీ తండ్రి వనవాసానికి వెళ్ళమని ఏదైతే అన్నాడో, ఆ వనవాస ఫలితాన్ని నీ అంతట నీవే సిద్ధింపజేయాలి. సత్యవ్రతబుద్ధియైన నీ తండ్రి ఇచ్చిన వరాల లోను, నీవు చేస్తున్న సత్యవాక్పరిపాలన లోను దాగి ఉన్న ధర్మసూక్ష్మం ఇదే.
రామా ! ఆ తండ్రికి తండ్రి, కొడుకువైన నీకు నీవు, ఇద్దరికి ఇద్దరూ ధర్మం చేత అనుసంధానం చేయబడిన ఊహ, క్రియల యొక్క ఒకే రూపం నాయనా ! "
మహాఋషులు ద్రష్టలు. రావణసంహారమనే మహావ్యూహనిర్మాతలలో కైకేయి ఒకరు కాగా, దానిని చక్కగా యెలా అమలుపరచాలో తెలిసి, దానిని క్రియారూపం దాల్చేటట్లు చేసిన రెండవవాడు అగస్త్యమహర్షి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment