తల్లినిబట్టి చూచికొనుఁ దాను సమీరసుతుండు లోకమం
దెల్లెడ నందమన్నది యేగతి నుండు నటంచు నీ తనూ
హల్లకగంథి యిప్పటికి నాగిన దాతని యీ పరీక్షకుం
జెల్లరె యీమె కావలయు సీత యటం చనుకొన్న యంతలో.
ఎంత యాలోచనాపరుం డేని సుంత
తొందరపడు శ్రమపడి తోనతోన
కనగ రామున కాంజనేయునకు నిద్ది
భేద మీ సుంత తొందర లేదు పతికి.
సీతంగాంచితి నంచు నెంచుచుఁ గపిశ్రేష్ఠుండు లాగూలముం
జేతంగైకొని ముద్దుగొంచు హసన శ్రీగండభాగుండునై
దూతత్వంబు ఫలించెనం చెగిరి గంతున్ వేసెనేకాని తాఁ
జేతో నిర్వృతి గాంచఁ డింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా.
లంకానగరంలో సీత కొరకు వెదుకుతున్న హనుమకు ఒక మృదుశయ్య పైన నిద్రిస్తున్న స్త్రీ కనిపించింది. తల్లి లక్షణాన్ని బట్టి స్త్రీగత సౌందర్యాన్ని పోల్చుకొనే స్వభావమున్నవాడు హనుమంతుడు.
" శీలానికి తల్లి సీతాదేవిని కొలమానంగా పెట్టుకొని లోకంలో స్త్రీ యొక్క సౌందర్యం యీ రకంగా ఉంటుందని పోల్చుకొంటాడు వాయునందనుడైన హనుమ. అతని పరీక్షకు ఇప్పటివరకు నిలిచింది మృదుశయ్యపై నిద్రిస్తున్న యీ సౌందర్యవతి మాత్రమే. ఆమె సీత కావచ్చునని అనుకొన్నాడు.
ఎంతటి ఆలోచనాపరుడైనా, శ్రమ పడటం వలన, కొంచెం తొందరపడటం సహజం. రాముడికి ఆంజనేయునికి యీ కొంచెం భేదం ఉంది. ఆ కొంచెం తొందపడటం కూడా శ్రీరామునికి లేదు.
సీతను చూశానన్న ఆనందంతో ఆంజనేయుడు తోకనెత్తి పట్ట్టుకొని ముద్దాడి, చెక్కిలి మీద చిరునవ్వు తొణికిసలాడుతుండగా, తన రాయబారం ఫలించిందని యెగిరి గంతేశాడు కానీ, బయటి మనస్సు రంజిల్లినంతగా, లోపలి మనస్సు మాత్రం కుదుటపడలేదు. "
హనుమంతుడు తన అన్వేషణలో మండోదరిని చూసి సీత అని భ్రమించాడు. మండోదరి పతివ్రత. ఆ పాతివ్రత్య లక్షణం హనుమను కొంచెం తొందరపడేటట్లు చేసి, నిదానంగా మరికొంత విశ్లేషణ చేయనీయకుండా తాత్కాలికంగా నిరోధించింది. మహాత్ముల యెడల ఇది తాత్కాలికమైన తొందరపాటు కావున, హనుమ బయటికి సంతోషించినట్లు కనపడినా, అతడి అంతశ్చిత్తం మాత్రం కుదుటపడలేదు.
తనూహల్లకగంథి అంటే సువాసనలు వెదజల్లే శరీరం కలది (యోజనగంథి వలె).
హల్లకము = చెంగలువ
ఈ పద్యాలు శ్రీమద్రామాయ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment