నీవేమిటి శ్రీరామా !
యీ విమలేతరము కార్యమేమిటి రామా !
నే విన్నదాని కెంతో
పై వెలసినదీ మహానుభావత చూడన్.
ఇది యేమి చేసినాడవు
త్రిదివాయోగ్యంబు కర్మ దెప్పరమున్ బె
ట్టిదమును నిద్యంబును దు
ర్మదు లస్వర్గ్యులు పొనర్చు మలినంపుఁ గృతిన్.
ఉన్న పరిస్థితుల్ సకలమూహ పొనర్చితి నొక్క ధైర్యమై
యున్నది దాని మాపితి వయోగ్యముగాఁ బొనరించి, త్వాదృశుల్
సన్నుతులే యధర్మపథసంగతులైనెడ నింక నేమిది
క్కున్నది ధర్మదేవత కహోవిపరీతమయైన సృష్టిలో.
రాముని బాణానికి వాలి నేలగూలాడు. తనను సమీపించిన రాముడితో యిలా అన్నాడు.
" రామా ! నువ్వేమిటి, నీవు చేసిన యీ అయోగ్యమైన పనేమిటి? నీ మహానుభావత నిన్ను గురించి నేను విన్నదాని కంటె చాలా పైన ఉన్నదే !
అయ్యో ! ముల్లోకాల్లోను అయోగ్యంగా పరిగణించబడేది, కర్మవిరుద్ధమైనది, క్రూరమైనది, నిందించదగింది, మదంతో కూడినవారు, స్వర్గంపై చూపు లేనివారు చేసే పాపపు పని చేసావు కదా !
నా ముందున్నటువంటి అన్ని పరిస్థితులను మదింపు వేసుకొని, ఒక్క విషయంలో ధైర్యంగా ఉన్నాను. అయోగ్యమైన పని చేసి దానిని నామరూపాల్లేకుండా చేసావు కదా ! నీ వంటి సజ్జనులే అధర్మమార్గంలో పోతూ ఉంటే, తారుమారుగా ఉన్న సృష్టిలో ఇక ధర్మదేవతకు దిక్కెవరు? "
వాలి మాట్లాడిన మాట " మహానుభావత " అనేదానిలో నింద అంతర్గర్భితంగా ఉంది. కాగా, వాలి అడిగిన ప్రశ్నల లోనే సమాధానం కూడా దాగి ఉంది. " విపరీతమయైన సృష్టిలో " ధర్మదేవతకు దిక్కెవరని అడిగాడు. ధర్మమార్గంలో నడిచే సృష్టిని, జీవించటానికి అయోగ్యంగా, తారుమారు చేసేది సృష్టిజీవులే. సోదరుడనే దివ్య, భవ్య భావనకు విలువ లేకుండా, తెలియక చేసిన తప్పును దురహంకారంతో పెద్దది చేసి చూపి, అతడిని దేశబహిష్కృతుడిని చేసి, అతడి భార్యను పరిగ్రహించటం, సోదరప్రేమను దుర్వ్యాఖ్యానం చేయటమే కాక, అనాగరకమైన చర్య.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment