రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్
రాముడె యెల్ల నా బ్రతుకు రాముడు నన్నును గన్నతండ్రి యీ
రాము వినా నిమేష మవురా మనజాలను గాదయేని నీ
రాముని వీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా ! గ్రహింపవే !
విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు. దశరథుడు కూడా చేయవలసిన సేవలన్నీ చేసాడు. విశ్వామిత్రుడు మహాతపశ్శాలి అనే భక్తితోనో, ఆయన మహాకోపిష్టి అనే భయంతోనో, లేక లేక పుత్రులను కలిగారన్న సంతోషంతోనో, దశరథుడు విశ్వామితుడేమి కోరుకొన్నా తీరుస్తానన్నాడు.
విశ్వామిత్రుడు రాముడిని తనతో పంపమనేటప్పటికి గుండెలో రాయి పడినట్లయింది. ' చిత్తం, చిత్తం ' అంటూనే, విషాదవదనంతో, దశరథుడు మునితో ఇలా అన్నాడు.
" మహర్షీ ! నా కన్నీ రాముడే. శుచిత్వం కోసం నేను చేసే స్నాన, జప, ధ్యానాదు లన్నీ రాముడే. నా బ్రతుకు పరమార్థం రాముడే. రాముడు నా కన్నతండ్రి, గారాలపట్టి. రాముడిని విడిచి నేనొక్క నిముషం కూడా బ్రతుకలేను. ఇక మీరు తప్పదంటే, నా రాముడిని విడిచిపెట్టి యీ సమస్త రాజ్యాన్ని తీసుకొనండి. "
స్నానం శారీరక శుద్ధిని, జపం మానసిక శుద్ధిని, ధ్యానం ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తాయి.
దశరథుడు విశ్వామిత్రుడిని, " గాధిసుతా ! " అని సంబోధించటంలో కొంత ఆత్మరక్షణ, ఆపద్ధర్మ పాలన ఉన్నాయనిపిస్తుంది. కుశనాభుని కొడుకైన గాథికి సత్యవతి అనే కూతురు ఉంది. ఆమెను చూసి ఋచీకుడు అనే మునీశ్వరుడు తనకిచ్చి వివాహం చేయమన్నాడు. వృద్ధమునికి కూతురు నివ్వకుండా తప్పించుకోవటానికి, చెవులు నల్లగా, ఒళ్ళంతా తెల్లగా ఉన్న గుర్రాలను ఇవ్వమన్నాడు గాధి. ఋచీకుడు తన తపశ్శక్తితో, ఆ గుర్రాలను తెప్పించి ఇవ్వటం చేత, సత్యవతిని అతని కిచ్చి వివాహం చేయక తప్పలేదు. ఆ గాధికి జన్మించినవాడే విశ్వామిత్రుడు. ఆపద్ధర్మంగా ఒకదాని బదులు ఇంకొకటి కోరటం, ఒకదాని బదులు ఇంకొకదాని నివ్వటం ఆపద్ధర్మమని విశ్వామిత్రునికి గాధి ఉదంతాన్ని దశరథుడు గుర్తుచేసాడా అన్నట్లున్నది యీ సంబోధన.
ఇక రెండవది, బ్రహ్మర్షి పదవిపై కాంక్షతో రాజ్యాన్నే త్యాగం చేసాడు విశ్వామిత్రుడు. పరబ్రహ్మ స్వరూపమైన రాముని కోసం రాజ్యాన్ని ధారాదత్తం చేస్తానంటున్నాడు దశరథుడు.
ఈ పద్యంలో రామునిపై దశరథుని ప్రేమ, పుత్రవాత్సల్యం యెంతగా పెనవేసుకుపోయిందో అర్థమౌతుంది. దశరథునికి జగమంతా రామమయం. రాముని కోసం, విశ్వామిత్రుని యెడల భీతి వహిస్తూనే, సంశయిస్తూనే, చెప్పవలసిన మాట చెప్పాడు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనిది.
No comments:
Post a Comment