జావును వ్రాసె వేల్పుగమి చాలదుఁ గారుడయక్షరాడ్భుజం
గావలి చాలదిప్డు కను మస్మదమోఘము ముష్టిఘాతమై
నీవిట నావులించెదవు నెత్తుఱు క్రక్కుచుఁ జావు ముందరన్.
అనినన్ రావణు డేది గ్రుద్దుము త్వదీయంబైన దోశ్శక్తి చూ
తుననన్ మారుతి క్రొత్త చూచెదవు నా దోశ్శక్తి నీ బిడ్డ య
క్షుని శీర్షంబది రెండుగాఁ బగిలె నా గ్రుద్దుంబడిన్నాగ రా
వణు దుఃఖస్మృతి వాయుతాడితము కోపజ్వాల మిన్నంటగా.
ఒక వైపు రాక్షసవీరు లొక్కొక్కరిగా వానరుల చేతిలో మరణిస్తుండగా, రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశం నుండి విముక్తులవటం రావణుడికి ఆశ్చర్య మనిపించింది. ఇక, స్వయంగా తానే రంగప్రవేశం చేయనిది లాభం లేదనుకొని, ధనుర్ధారియై రావణుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఇరుప్రక్కలా, వీరులు భీకరంగా పోరు సలుపుతున్నారు. ఇంతలో రావణుడిపై సుగ్రీవుడు ఒక పెద్ద కొండను విసిరాడు. దానితో, సుగ్రీవుడు ప్రహస్తుడిని చంపాడన్నది గుర్తుకొచ్చి, రావణుడికి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. అంతే, అ సుగ్రీవుడిపై బాణవర్షం కురిపించాడు. ఒక బాణం సుగ్రీవుడి రొమ్ములో గ్రుచ్చుకోగా, సుగ్రీవుడు మూర్ఛపోయాడు. వానరసైన్యం హాహాకారాలు చేసింది. రాక్షసుల చేతిలో వానరవీరులు మరణిస్తుండటం, సుగ్రీవుడు మూర్ఛనొందటం చూసేసరికి, హనుమంతుడు, యముడిలాగా పండ్లు బిగించి, పిడికిలి బిగించి, కన్నుల్లో నిప్పులు కురిపిస్తూ, ఎండాకాలం చివరలో మేఘం ఉరిమినట్లు గర్జిస్తూ, రావణుడితో ఇలా అన్నాడు.
" ఆ బ్రహ్మదేవుడు చివరకు నీకు వానరుల చేతిలో చావు రాసిపెట్టినట్లున్నాడు. నీకిప్పుడు దేవతలు గానీ, గారుడాస్త్రం, కుబేరాస్త్రం, నాగాస్త్రం వంటివి గాని సరిపోయేటట్లు లేదు. అందుకని, అమోఘమైన నా పిడిగ్రుద్దును రుచి చూడు. అప్పుడు, చచ్చే ముందర నెత్తురు కక్కుకుంటూ, ఆవులిస్తూ చస్తావు..
ఈ మాట వినగానే రావణుడు, " ఏదీ గ్రుద్దు, నీ చేతుల్లో యెంత బలముందో చూస్తాను. " అన్నాడు. ఆంజనేయుడన్నాడు గదా ! " నా భుజబలం నువ్విప్పుడు క్రొత్తగా చూసేదేముందిల్ ! ఒక్క గ్రుద్దు గ్రుద్దగానే, నీ కొడుకు అక్షుడి తలకాయ రెండుగా పగిలిందే , అప్పుడు చూడలేదా నా భుజబలం? " అన్నాడు. ఈ మాటలతో రావణుడికి దుఃఖం పొంగుకొచ్చి, గాలి తీవ్రత చేత అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డట్లుగా, కోపం మిన్నంటింది. "
హనుమ రావణుల మధ్య సహజమైన సంభాషణలతో ఛందోబద్ధం చేసిన యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment