నీ కొడుకును గైకొని చని
మా కాకలి యంచుఁ దిందుమా? పిచ్చినృపా !
మాకడఁ బ్రశస్త మస్త్ర
వ్యాకృతి కలదద్ది నేర్పి పంపెద మింతే !
ఇమ్మగు విద్య నేర్పెదము నింకను చిన్న మెత్తు కా
ర్యమ్మును జేసిపెట్టవలె నాపయిఁ బూవులలోనఁ బెట్టి కై
కొమ్మని నీ కుమారుఁడిడుగో నని నీక యొసంగు వార మా
పిమ్మట నీవుగా నతని వీడవలెన్ మఱి మాకు నేటికిన్.
రాముడిని తనతో పంపమని, అస్త్రవిద్యా విశారదుడిని చేస్తానని విశ్వామిత్రుడు దశరథునికి చెప్పాడు. రాముడు తన జీవిత సర్వస్వమని, రాముడిని పంపటం తప్ప రాజ్య త్యాగం చేయమన్నా చేస్తానని దశరథుడు మహర్షిని వేడుకొన్నాడు. దానితో కించిత్తు కినుక వహించినా, అనునయిస్తున్న ధోరణిలో, విశ్వామిత్రుడు రాజుతో ఇలా అన్నాడు.
" ఓ రాజా ! ఎంత బేలగా మాట్లాడుతున్నావు. నీ కొడుకును మాతో తీసుకువెళ్ళి, మాకు ఆకలయ్యిందని, నీ కొడుక్కి పెట్టకుండా తింటామా? మ దగ్గర అపూర్వమైన అస్త్రవిద్య ఉందయ్యా ! దాన్ని చక్కగా నేర్పి పంపిస్తా మంతే !
మా వద్ద ఉన్న అపారమైన ఉన్న అస్త్రవిద్యను నేరుతామంటున్నాము. అయితే, మాకొక చిన్నమెత్తు పనిని కూడా చేసి పెట్టాలనుకో. తరువాత నీ కొడుకుని పువ్వుల్లో పెట్టి , ' ఇదిగోనయ్యా నీ కొడుకని ' నీకే అప్పగిస్తాము. అటుపిమ్మట నీ అంతట నువ్వు అతడిని విడిచిపెట్టాలి గానీ, మరి నీ కొడుకు మాకెందుకయ్యా ! "
దశరథుడు రాముడిని పంపనని ఖరాఖండిగా చెప్పినా, ముందుగా కించిత్తు కోపం తెచ్చుకొన్నా, తరువాత మునుపటి స్వభావానికి భిన్నంగా, విశ్వామిత్రుడు అనునయంగా మాట్లాడటం గమనార్హం. రాజును " పిచ్చినృపా ! " అని సంబోధించిన తీరు విశ్వామిత్రుడు దశరథుని యొక్క తండ్రిహృదయాన్ని అర్థం చేసుకొన్నాడని, లేకలేక పుట్టిన, ప్రాణానికి ప్రాణమైన, దశరథుని దృష్టిలో పసివాడైన రాముడిని పంపటానికి సంశయిస్తున్నాడని స్పష్టమౌతుంది.
మహర్షులు త్రికాలవేదులు. విశ్వామిత్రుని మాటలలో భవిష్యత్తులో జరగబోయే రాముని వనవాసానికి సంబంధించిన విషయం ధ్వనిస్తున్నది.
విశ్వనాథను గురించి ఒక్కమాటలో చెబుతూ ఆచార్య ముదిగొండ శివప్రసాదు గారు, " ఆయన బయట విశ్వామిత్రుడు, లోపల వశిష్ఠుడు " అన్నారు. విశ్వనాథది " నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. " విశ్వామిత్రుడి హృదయం నవ్యనవనీత సమానం, మాట మాత్రమే వజ్రాయుధమంత పదును. అందుచేతనే, తనదైన స్వభావాన్ని విశ్వనాథ, విశ్వామిత్రుని పాత్రలో అద్దంలో చూసినట్లు చూడగలిగారు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అహల్యా ఖండము లోనివి.
No comments:
Post a Comment