హమ్మున్ దేహము నంతటి దగ్గరివటమ్మా ! మోహముం ధర్మమున్
గొమ్మా! తొల్తటి దెంత బోలొ, తుదిదో కొమ్మంతయౌఁ జేవ, రా
జ్యమ్మున్ వీడగ నేమి విప్లవము సంప్రాప్తించె నీ నేలకున్.
తల్లియు సుమిత్ర యెంత శాంతాత్మ యౌనొ
కొడుకు లక్ష్మణుఁ డంతటిఁ కోపరాశి
తల్లి కైకయి యెంత సంతప్తమతియొ
భరతుఁ డంతటి శాంతస్వభావరాశి.
ఎవరు యెంత చెప్పినా, ధర్మానికి కట్టుబడి రాము డడవికి పోవటానికే సంకల్పించాడని స్థిరనిశ్చయం చేసుకొన్న కౌసల్య దుఃఖిస్తూ ఉంటే, రాముడు ఆమెను కౌగలించుకొని, కన్నీటిని తుడిచి, ఓదార్చి ఇలా అంటున్నాడు.
" అమ్మా ! ఈ దుఃఖం, కోపం, తాపం, ఇవన్నీ మోహం వల్లవచ్చినవే కదా ! చూడగా చూడగా, దేహానికి దేహానికి ఇంత దగ్గరి చుట్టరికమా? మోహం, ధర్మం - ఈ రెండింటినీ ఒక్కసారి లోతుగా పరిశీలన చేయి. మొదటిది యెంత డొల్లతనం కలిగిందో, చెట్టుకొమ్మ లాగా ధర్మమంత చేవ కలిగినది. నేను రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినంత మాత్రాన యీ భూమిలో విప్లవ మొస్తుందా ఏమిటి? "
సవతులలో తన తల్లి చులకనౌతుందన్న భావాన్ని కూడా నిర్ద్వద్వంగా ఖండించాడు రాముడు. దశరథుని భార్యలలో, తన తల్లి ఎప్పటికీ పట్టపురాణేనని చెప్పి, తన తమ్ముడు భరతుడు అంతటి అధర్మపు రాజా అని ప్రశ్నించాడు. ఈ సందర్భంలో రాముడన్న మాటలు, రాము డెంతటి " విశేషభావమతి, సంశుద్ధుం డవిద్ధాత్ముడో " తెలియజేస్తాయి.
" అమ్మా ! ఇది చూడు. తల్లి సుమిత్ర యెంత పవిత్రాత్మ, శాంతస్వభావురాలో, ఆమె కొడుకు లక్ష్మణు డంతటి కోపిష్టి. తల్లి కైక యెంత తాపానికి గురి అవుతుందో, కొడుకు భరతుడు డంతటి నిండుకుండ, శాంతస్వభావుడు. "
లక్ష్మణుడు ఆదిశేషువు అంశతో పుట్టినవాడు. బుసలు కొట్టడం ఉపాసనా స్వరూపుడైన అతని జీవలక్షణం. పరమ భాగవతోత్తముడైన భరతుడో, శ్రీ మహావిష్ణువు పూరించే శంఖము యొక్క అవతారం. ఆ శంఖం నుంచి వెలువడేది ప్రభువు నాదమే. అందువల్లనే, రామాయణంలో, భరతుడు ముమ్మూర్తులా రాముడే.
తత్త్వాన్ని బోధపరిచే ఇంత చక్కని పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
No comments:
Post a Comment