తగ నిచ్చోటనె యుండుడంచు బలవంతంబేను గావింప నీ
దగు హృద్వీధి మదాశ్రమంబున నయోధ్యన్ భేదమే లేని య
ట్లుగ నద్దాన వనంబున న్నిలిచినట్లుం గాదు నా పైన స్వే
చ్ఛగ మీకుండదు నిత్యమద్గత మనీషా భక్తి శుశ్రూషలన్.
అడుగున గులకరాలై వారి సీలమండల లోతుగా జలజలస్రవించు
నొకచోట, నొకచోట నుజ్వలాగాఢవారి తరంగ భీకర శ్రీ వహించు
వైడూర్యకాంతి ప్రవాహ శోభారమ్య సికతాస్థలంబులు చెన్నుమిగులు
నొకచోట, నొకచోట నొగిఁ దెల్ల చమరిలేళ్ళులతోఁ కలట్టి ఱెల్లుపువులొప్పు
నెచ్చటెచట మీ యిష్టము వచ్చినన్ని
గిరి నికట భూములును సదాభరితశోభ
లద్ది గోదావరీతీర మచటఁ బంచ
వటి యనంగను నొక్క శుభస్థలంబు.
అది మీ యున్కికిఁ జాల భద్రమగుఁ జో టాచోటి నానా రమా
స్పద శోభావ్రజముం గనుంగొనుచు నీ భావంబు నా రామచం
ద్ర ! దయావార్థి ! యుగాలుగా నచట భద్రంబై రమించున్, భవ
త్పద సీతాపద చిహ్న మా యడవి తాల్పన్ మౌళి పద్మాకృతిన్.
సీతారాములకు అగస్త్యాశ్రమ వాతావరణం అయోధ్యా నగరంలో ఉన్నంత తృప్తి నిచ్చింది. ఒక్కచోటనే ఉండటం వనవాసవ్రతాన్ని పాటించినట్లవదన్న భావనతో, శ్రీరాముడు మిగిలిన నాలుగేండ్లు గడపటానికి అనువైన ప్రదేశం గురించి అగస్త్య మహర్షిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.
" మిమ్మల్ని ఇక్కడే ఉండమని నేను బలవంతం చేయను. మీ హృదయాలలో నెలకొన్న యీ ఆశ్రమ వాతావరణానికి అయోధ్యకు భేదమే లేదన్న భావన సంతోషదాయకమే అయినా, అది వనవాసంలో ఉన్నట్లు కాదు. అంతేకాకుండా, మీరిక్కడ ఉన్నంతకాలం, నా మీద భక్తిశ్రద్ధలు చూపించటం, నా శుశ్రూష చేయటం మీద ధ్యాస పెట్టటం వల్ల, మీకు ఇక్కడ వనవాసంలో ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.
ఇక అరణ్యప్రాతంలో మీకనువైన ప్రశాంత వాతావరణ మంటారా ! గోదావరి నది ప్రవహించే ప్రదేశముంది చూసారా? ఒక్కొక్క చోట సీలమండల లోతు మాత్రమే ఉండి అడుగున గులకరాళ్ళు కనపడుతూ జలజలా ప్రవహించే నీళ్ళు, ఒకచోట పెద్ద తరంగాలతో గంభీరంగా ఉజ్జ్వల ప్రవాహం, ఇంకొక చోట, అందమైన ఇసుక తిన్నెలతో, వైడూర్యకాంతితో ప్రవహించే నదీజలం, మరొకచోట తెల్లని చమరీమృగాలతో, గెంతే లేళ్ళతో సుందరంగా కనిపించే ఱెల్లుపూల తీరాలు, ఎక్కడపడితే అక్కడ మీకు ఇష్టం వచ్చినన్ని పర్వతసమీప భూములతో, ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తూ, మనస్సుకు హాయిని కల్గించే గోదావరీతీరంలో పంచవటి అనే శుభప్రదేశం మీరుండటానికి అనువుగా ఉంటుంది.
ఓ దయాసముద్రుడా ! రామచంద్రా ! ఆ చోటు చాలా భద్రమైనది. మీరుండటానికి అనువైనది. సుందరమైన ఆ ప్రదేశం అనేక సంపదలకు ఆలవాలమై, లక్ష్మీప్రదమై, యుగయుగాలనుంచి నీ భావాన్ని భద్రంగా నిలుపుకొన్నది. తలమీద పద్మాన్ని ధరించినట్లుగా ఆ అడవి నీ చిహ్నాలను, తల్లి సీత చిహ్నాలను భద్రంగా దాచుకొన్నది. "
పంచవటిని అనువైన ప్రదేశంగా నిర్ణయించటం ఋషి ప్రణాళికలో ఒక భాగం. సీతాపహరణానికి, తద్వారా, రావణ సంహారానికి నాంది పలికిన మూలప్రదేశమది.
గోదావరీ తీరంలోని పంచవటి ఏది అన్నది అలా ఉంచితే, విశ్వనాథ, తెలుగువారి ఆరాధ్యదైవం భద్రగిరి రాముణ్ణి, సీతమ్మను దృష్టిలో ఉంచుకొని యీ వర్ణన చేసినట్లనిపిస్తుంది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment